- కార్మిక సంక్షేమానికి వెనకాడేది లేదు
- ఫ్రీ మాస్టర్లు చెల్లవు
- సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్
- బెల్లంపల్లి రీజియన్ లో పర్యటన

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి సింగరేణి పరిరక్షణ కొరకు అంకితభావంతో సక్రమంగా విధులు నిర్వహించాలని సింగరేణి సిఎండి ఎన్ బలరాం నాయక్ సూచించారు. బుధవారం ఆయన బెల్లంపల్లి రీజియన్ లోని శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాలోని పలు గనులలో ఆయన సింగరేణి నూతన ఆపరేషన్స్ డైరెక్టర్ ఎల్వి సూర్యనారాయణ, నూతన ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ (పి అండ్ పి) డైరెక్టర్ కే వెంకటేశ్వర్లు తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ గనిని సందర్శించిన ఆయన కార్మికులతో కలిసి అల్పాహారం చేసి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 5, మందమర్రి ఏరియాలోని కేకే 5 గనులను సందర్శించారు. పర్యటనలో భాగంగా ఆయన అండర్ గ్రౌండ్ లో సైతం పర్యటించి, కార్మిక సమస్యలు అడిగి తెలుసుకుని, పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మందమర్రి ఏరియాలోని కేకే 5 గని పై నూతన డైరెక్టర్లు, ఏరియా జిఎం జి దేవేందర్ లతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్మికుల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే రీజియన్ లో పర్యటించడం జరిగిందని తెలిపారు. సింగరేణి అభివృద్ధికి రక్షణ, ఉత్పత్తి రెండు కళ్ళ లాంటివని తెలిపారు. వేసవిలో పెరగనున్న విద్యుత్ డిమాండ్ దృష్ట్యా ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సింగరేణి నూతన గనులు రావాల్సిన ఆవశ్యకత కలదని తెలిపారు. సింగరేణి, దాని ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కలగాలంటే, సింగరేణి ఉత్పత్తి పెరగడంతో పాటు ఉద్యోగులు నాణ్యత, రక్షణ పాటించాలని, సంక్షేమాన్ని పెంపొదించుకోవాలన్నారు. గతంలో ఉన్న పని విధానాలు సింగరేణిలో ప్రస్తుతం లేవని, అధునాతన సాంకేతికతతో రక్షణ కూడిన అధిక ఉత్పత్తికి యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. పాత తరం కార్మికులు ఎంతో శ్రమకోర్చి, కష్టపడి పనిచేసే వారని, యువ కార్మికులు వారిని ఆదర్శంగా తీసుకొని, విధులు నిర్వహించాలని సూచించారు. కొంతమంది యువ కార్మికులు తమ పద్ధతి మార్చుకొని, సింగరేణి ఉత్పత్తిలో భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రతి ఒక్క ఉద్యోగి తమ పని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అంకితభావంతో పనిచేసే సింగరేణి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సింగరేణిలో ఫ్రీ మాస్టర్ల విధానం చెల్లదని, దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఫ్రీ మాస్టర్లు పడేవారి వివరాలు యాజమాన్యానికి తెలపాలన్నారు. అదేవిధంగా కార్మిక సంక్షేమంలో సైతం సింగరేణి యాజమాన్యం వెనకాడడం లేదన్నారు. కార్మికుల సౌకర్యార్థం గోదావరిఖనిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తో పాటు నస్పూర్ సింగరేణి పాఠశాలలో సిబిఈఎస్ సిలబస్, నూతన క్వార్టర్ల నిర్మాణం తదితర కార్యక్రమాలను యాజమాన్యం నిర్వహిస్తుందని వివరించారు. కార్మికులు ఇంకేమన్నా సమస్యలు ఉంటే యాజమాన్యం దృష్టికి తీసుకువస్తే, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తిలో భాగస్వామ్యం సింగరేణి అభివృద్ధి పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా ఏరియాల ఉన్నత అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.





