Friday, March 20, 2026

బొగ్గు గని కార్మికుల రక్షణ, సంక్షేమం, భద్రత లపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

  • బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- దేశవ్యాప్తంగా పనిచేస్తున్న బొగ్గు గని కార్మికుల రక్షణ, భద్రత, సంక్షేమం చూసే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి తెలిపారు. అఖిల భారతీయ కథాన్ మజ్దూర్ సంఘ్ (బిఎంఎస్) 19వ త్రైవార్షిక జాతీయ మహాసభలు ఫిబ్రవరి 12, 13న నాగపూర్ లో నిర్వహించగా, ఈ కార్యక్రమానికి బిఎంఎస్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సురేందర్ కుమార్ పాండే, బిఎంఎస్ బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి లతో పాటు దేశంలోని 10 బొగ్గు సంస్థలు, సిఎంపిడిఐఎల్, నైవేలి నుండి సుమారు 800 మంది ప్రతినిధులు హాజరయ్యారని, ఈ సభలో పలు తీర్మానాలకు ఆమోదం తెలిపినట్లు సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బిఎంఎస్) రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహాసభ లలో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (సిఎంపిఎఫ్) కార్యాలయం ప్రక్షాళన చేయాలని, కార్మికులందరికీ అన్ లైన్ సేవలు అందించాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కోల్ మైన్స్ పెన్షన్ ఫండ్ లో జరిగిన అవినీతి అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం సిబిఐ చే దర్యాప్తు జరిపించాలని, డిహెచ్ఎఫ్ఎల్ లో పెట్టుబడి పెట్టిన నాన్ కన్వర్టబుల్ డిభేంచర్స్ 1390.25 కోట్ల రూపాయలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఈ ఫైనాన్షియల్ సర్వీసులో పెట్టిన 727.67 కోట్ల రూపాయలు, రిలయన్స్ క్యాపిటల్ లో పెట్టిన 150 కోట్ల రూపాయిలు పెట్టుబడులు పెట్టగా, ఆ సంస్థలు దివాల తీయడంతో తిరిగి చెల్లించలేదని, ఈ విషయంలో సిఎంపిఎఫ్ అధికారులు సరైన సమయంలో స్పందించకపోవడం వలన కార్మికుల సొమ్ము రాబట్ట లేకపోయారని ఆరోపించారు. ఈ విషయంపై సిబిఐ చేత దర్యాప్తు చేసి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి, కార్మికుల సొమ్ము రాబట్టి, బాధ్యులైన అధికారులను శిక్షించాలని మహాసభలో తీర్మానించారన్నారు. బొగ్గు పరిశ్రమలలో రోజురోజుకు పర్మనెంట్ కార్మికులను తగ్గించి, ఉత్పత్తి పెంచుతూ, కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టిచాకిరి చేయిస్తూ, కనీస సౌకర్యాలు, వేతనాలు, సామాజిక భద్రతలను ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1990లో కోల్ ఇండియా లిమిటెడ్ లో 6.5 లక్షల మంది కార్మికులు ఉండగా, ప్రస్తుతం 2.7 లక్షల మంది కార్మికులు కార్మికులు ఉన్నారని, 2023-24 లో 774 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 శాతం ఎక్కువ ఉత్పత్తి లక్ష్యం నిర్ణయిస్తున్నారని, యాంత్రికరణ పేరుతో పర్మనెంట్ కార్మికులను తగ్గించి, కాంట్రాక్ట్ కార్మికులను పెంచడం వలన రాబోయే రోజుల్లో కార్మికుల్లో అశాంతి ఏర్పడే అవకాశం ఉందన్నారు. పర్మనెంట్, కాంట్రాక్ట్ కార్మికులు నిష్పత్తి సగానికి సగం ఉందని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ కార్మికులకు లభించే అన్ని సదుపాయాలు, హక్కులు కల్పిస్తూ, కనీస వేతనం బొగ్గు గని కార్మికులకు షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ నిర్ణయించాలన్నారు. అప్పటివరకు కనీస వేతనం అందరికీ హై పవర్ కమిటీ వేతన చెల్లించి, గ్రాట్యుటీ, పెన్షన్, సిఎంపిఎఫ్, ఈఎస్ఐ, పీఎంఈ, సామాజిక భద్రత కల్పించాలని మహాసభలలో తీర్మానించారని తెలిపారు. మహాసభలో బొగ్గు గనులలో తరుచూ జరుగుతున్న ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేశారని తెలిపారు. 2021లో 29, 2022లో 20, 2023లో 29, 2024లో 25 దుర్ఘటనలు జరిగాయన్నారు. అంతర్జాతీయ సేఫ్టీ రూల్స్ ప్రకారం, డిజిఎంఎస్ నిబంధనల ప్రకారం బొగ్గు గనులలో పనులు నిర్వహించడం లేదని ఆరోపించారు. సమస్యలపై ప్రతినిధుల సమావేశంలో చర్చించిన, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ప్రభుత్వం స్పందించి, కేంద్ర బొగ్గు గనుల కార్యదర్శి నిర్దేశించిన ప్రకారం జీరో యాక్సిడెంట్ పొటెన్షియల్ తీసుకురావాలని తీర్మానించారన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సామాజిక భద్రత కింద గరిష్టంగా ప్రజలకు 4000 వేల రూపాయలు పెన్షన్ ఇస్తుందని, బొగ్గు గని కార్మికుల కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ కింద వెయ్యి రూపాయలు కనీసంగా చెల్లించడం సోషల్ అండ్ అన్ జస్టిస్ అవుతుందని, కనీస పెన్షన్ పది వేల రూపాయలు చెల్లించాలని తీర్మానించారని వివరించారు. పెన్షన్ కు వైద్య సదుపాయాలు, ఎం ప్యానల్ ఆసుపత్రులను ఎక్కువగా పెంచాలని తీర్మానించారని తెలిపారు. పై సమస్యలు పరిష్కారానికి అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు చేయాలని సమావేశంలో తీర్మానించడం జరిగిందన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News