నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విధించిన కోతలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కోతలతో ప్రజల బాధలు తీరేనా అని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి ప్రశ్నించారు. జిల్లాలోని జన్నారంలో సిపిఎం నాయకులు కొండగొర్ల లింగన్న అధ్యక్షతన నిర్వహించిన సిపిఎం జన్నారం మండల కమిటీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంకె రవి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, ఉపాధి హామీ పథకానికి, సంక్షేమ పథకాలకు, విద్యా, వైద్యం కోసం నిధులు కేటాయించకుండా, ఉన్నవాటికి తగ్గించి, ప్రభుత్వం అండతో దేశాన్ని దోచుకుంటున్న బడా కార్పొరేట్ లకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ, తమ దేశభక్తి ఎవరి మీద ఉందో నిరూపించుకుంటున్నారో తేటతెల్లం అవుతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు జరపడంలో కేవలం దరఖాస్తులు పెట్టించే హడావుడి కార్యక్రమంలో మిగిలిపోయిందని విమర్శించారు. ఇప్పటికె రెండుసార్లు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు పెట్టించుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జన్నారం మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కనికరపు అశోక్, నాయకులు కొండగొర్ల లింగన్న, ఒడిపెల్లి ప్రమీల, పోతు విజయ, ఆత్రం రాజు, ఎస్కే అబ్దుల్లా, అంబటి లక్ష్మణ్, దాసండ్ల రాజన్న, గడ్డం విజయ్ లు పాల్గొన్నారు.





