Sunday, March 22, 2026

శిక్షణలో నేర్చుకున్న అంశాలను నిబంధనలకు లోబడి అనుసరించాలి

  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు, సిబ్బందికి అందిస్తున్న శిక్షణ ముఖ్యమైదని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను ఎన్నికల సంఘం నిబంధనలకు లోబడి అనుసరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులకు అందిస్తున్న శిక్షణలో నేర్చుకున్న అంశాలను తూచా తప్పకుండా పాటించి, ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా విధులు నిర్వహించాలన్నారు. పోలింగ్ ఒక రోజు ముందు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. జిల్లాలో పట్టభద్రుల, శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల వ్యాసార్థం పరిధిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలు ఉండకూడదన్నారు. పోలింగ్ సమయంలో బ్యాలెట్ బ్యాంక్స్ లో ఉన్న స్లిప్పులు, రిజిస్టర్లో నమోదు చేసిన వివరాలలో ఎలాంటి బేధాలు ఉండకూడదని, ఓటర్లు, రిజిస్టర్లు, సంతకాలు, పరికరాల ఇతర అన్ని అంశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్ సమయంలో ఓటర్ల గోప్యతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికలలో పోలింగ్ శాతం పెంపొందించాలని, ఎన్నికల ప్రక్రియపై పిఓ లు, ఏపిఓ లకు మాన్యువల్ అందించడం జరుగుతుందని, ఈ మాన్యువల్ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగునున్న పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్సులను పోలింగ్ కేంద్రం నుండి స్ట్రాంగ్ రూమ్ కు, అక్కడి నుండి కరీంనగర్ కు తరలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతున్న సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు శ్రీనివాస్ రావు, హరికృష్ణ, ఎన్నికల పర్యవేక్షకులు కెవై ప్రసాద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News