Friday, March 20, 2026

జర్నలిస్టుల సమస్యలను విస్మరించొద్దు

  • ప్రభుత్వానికి టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి

నేటి సాక్షి-కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం విస్మరించొద్దని,సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయక తప్పదని అన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల హక్కులకు గడ్డు పరిస్థితులు ఏర్పడే ప్రమాదముందని,ఈ విషయంలో జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. సమస్యలపై పోరాటాలు చేయడానికి ఫెడరేషన్ నాయకత్వం సిద్దం కావాలని సూచించారు. శుక్రవారం కరీంనగర్ పట్టణంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలో గానీ,దేశంలో గానీ జర్నలిస్టుల హక్కులు హరింపబడుతున్నాయని, పాలకులు ఏ ఒక్క సమస్యను పరిష్కరించకుండా దాటవేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలో కొనసాగిన గత టీ ఆర్ ఎస్,బీఆర్ ఎస్ ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పూర్తిగా విస్మరించి తీరని అన్యాయం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా జర్నలిస్టులకు కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులు ఇవ్వలేక పోయిందని, జీవో 239 సమీక్ష పేరుతో కమిటీ వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, పెన్షన్ స్కీం, హెల్త్ కార్డులు, దాడుల నివారణకు ప్రత్యేక కమిటీలు, జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తదితర డిమాండ్ల సాధనకై ఫెడరేషన్ ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాలు చేయాలని మామిడి సోమయ్య పిలుపునిచ్చారు. ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు, వెంకట్ రాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ, పదవీ విరమణ చేసిన జర్నలిస్టులకు పెన్షన్ స్కీం అమలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్ స్కీంతో పాటు జర్నలిస్టుల రక్షణ చట్టం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ రాష్ట్ర రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జర్నలిస్టులకున్న రైల్వే రాయితీ పాస్ సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసేయడం అన్యాయమని, ఈ సౌకర్యాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు మాట్లాడుతూ, జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఫెడరేషన్ పోరాడుతుందని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరేందుల ప్రసాద్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు నల్లగొండ సత్తయ్య, సురేష్, సహాయ కార్యదర్శి కిరణ్, కొమ్ము గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News