
నేటి సాక్షి, మందమర్రి:- సింగరేణి ఏరియాలోని వర్క్ షాప్ కార్మికులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఏఐటియుసి ప్రతినిధుల బృందం మంగళవారం ఏరియా వర్క్ షాప్ లో పర్యటించి, కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ, ట్రేడ్ మెన్స్ కార్మికులకు టూల్ కిట్స్ ఇవ్వాలని, అవుట్ డోర్ వెళ్లే కార్మికులకు వాహన కన్వియన్స్ అందించాలన్నారు. అదేవిధంగా ఏరియాలోని కేకే 1 డిస్పెన్సరి నుండి ఎంవిటిసి వరకు కోల్ బెల్ట్ రహదారి గుంతల మయంగా మారడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రహదారి గుండా ప్రయాణించే కార్మికులు, కార్మికేతరులు తరచుగా ప్రమాదాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గం గుండానే సీహెచ్పీ లకు కోల్ ట్రాన్స్ పోర్ట్ చేయడం జరుగుతుందని, తక్షణమే ఏరియా జిఎం చొరవ తీసుకొని రోడ్డుకు మరమ్మతు చేయాలని కోరారు. వర్క్ షాప్ సమస్యలపై వర్క్ షాప్ యాక్టింగ్ డివైజిఎం కృష్ణారెడ్డి స్పందిస్తూ, ట్రేడ్ మెన్ కార్మికులకు టూల్ కిట్స్ అందజేస్తామని, అదేవిధంగా మిగిలిన సమస్యలను సైతం యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్, సహాయ కార్యదర్శి సోమిశెట్టి రాజేశం, జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, ఏరియా నాయకులు ఏగ్గేటి రాజేశ్వర్ రావు, ఆంథోని దినేష్, పిట్ నాయకులు కన్నం వేణు, పారేపల్లి రాజేశం, వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, మైన్ కమిటీ, సేఫ్టీ కమిటీ నాయకులు కిరణ్, కె రాజయ్య, యాదవ్, కె రమేష్, కె వెంకట్రావు, బొడ్డుపల్లి సదానందం, డ్రైవర్లు కుమార్, సత్యనారాయణ, రవీందర్, సురేష్, రాజేందర్ లు పాల్గొన్నారు.





