- శృంగేరి శారదాపీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ
నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): నేను, నాది అనే అహాన్ని విడిచి పెడితేనే దైవత్వానికి దగ్గరవుతామనే తత్వాన్ని ‘లింగ’ రూపంలోని ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తున్నారని శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు డాక్టర్ గర్రెపల్లి మహేశ్వరశర్మ పేర్కొన్నారు. సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో కోరుట్ల వాసవి కళ్యాణ భవనంలో శ్రీలింగ మహాపురాణ సప్తాహంలో భాగంగా గురువారం రెండవ రోజు ప్రవచనం కొనసాగింది. ఈ సందర్భంగా శర్మగారు మాట్లాడుతూ జీవన గమనంలో సృష్టి ద్వారా మనకు అందించబడిన ప్రతిదీ శూన్యమే అనే తత్వాన్ని శివుడు అందించాడన్నారు. మాఘ బహుళ త్రయోదశి అర్థరాత్రి లింగ రూపంలో శివుడు అవతరించాడని, అందుకే ఆ పవిత్ర రోజును మనం శివరాత్రి అంటున్నామన్నారు. లింగ రూపంలో అవతరించిన శివుడే, జ్యోతి రూపంలో, అదేవిధంగా ఐదు ముఖాలతో కొలువై ఉన్నాడని వివరించారు. సత్య రూపంలో దేనికి లొంగకుండా అఘోరునిగా శివుడు అవతరించాడని, దక్షిణ ముఖంతో ఉండే దేవాలయంలో పరమేశ్వరుడు అఘోరునిగా పూజలు అందుకుంటారన్నారు. చతుర్ముఖుడైన బ్రహ్మ సృష్టి కారకునిగా వ్యవహరిస్తే, ఆ సృష్టిని విష్ణుమూర్తి పరిపాలిస్తున్నాడని, శివుడు లయకారునిగా ఉంటూ ఈ సృష్టిని సమతుల్యం చేస్తున్నాడన్నారు. ఇదంతా శివుని ఆజ్ఞతోనే ఈశ్వరేచ్చగా జరిగే సృష్టి ధర్మమని ‘లింగ మహాపురాణం’ ద్వారా వేదవ్యాస భగవానులు మన జాతికి వివరించారని మహేశ్వరశర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్ష, కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, పురాణ కమిటీ చైర్మన్ పడిగెల శ్రీనివాస్, కన్వీనర్, పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు మోటూరి రాజేంద్రప్రసాద్, స్వర్ణకార సంఘ అధ్యక్ష, కార్యదర్శులు ఇందూరి ప్రసాద్, బెజ్జారపు చందు, నిర్వాహకులు శక్కరి వెంకటేశ్వర్, నీలి కాశీనాథ్, పిన్నంశెట్టి భానుమూర్తి, మంచాల రాజలింగం, పొద్దుటూరి జలంధర్, కూరగాయల శ్రీహరి, వొటారి చిన్న రాజన్న, గంప శివకుమార్, అల్లాడి మహేష్, మేడి కిషన్, శక్తి అశోక్ తదితరులు పాల్గొన్నారు.





