- బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి
- కమిషనర్ అనుమతి లేకుండా ప్రభుత్వ నిధులను కాజేసిన ఘనాపాటి
- రేపటిలోగా సస్పెండ్ చేయకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తాం
- బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : అనేక అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా ప్రభుత్వ నిధులను కాజేసిన వనపర్తి జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి బీరం సుబ్బారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు.ఈమేరకు గురువారం వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీ కార్పోరేషన్ కమిషనర్ అప్రూవల్ లేకుండా దాదాపు 16 లక్షల రూపాయలు తన డ్రైవర్, అటెండర్ల పేరు మీద చెక్కు రాసి డ్రా చేశారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.బీసీ కార్పోరేషన్లో జమ అయిన నిధులు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న బీసీలకు ఇవ్వాలని, ఏదైనా ఖర్చు చేయాలంటే తప్పనిసరిగా కమిషనర్ అనుమతి ఉండాలని నిబంధనలు ఉన్నప్పటికి అవేమీ పట్టించుకోకుండా తన స్వంతానికి వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆతనిపై అనేక ఆరోపణలు వచ్చినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తూ వచ్చారని, దీంతో ఆదికారి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు.నాగర్ కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్నప్పుడు హాస్టల్ విద్యార్థులకు అన్యాయం చేశాడని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారని,ఈ కేసు పెండింగ్లో ఉండగా వనపర్తి జిల్లాకు అసిస్టెంట్ జిల్లా అధికారిగా బదిలీ చేయడమే కాకుండా ఇంచార్జి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారిగా మరియు ట్రైబల్ వెల్ఫేర్ ఇంచార్జ్ జిల్లా అధికారిగా నియమించడం జరిగిందన్నారు.అంతేకాకుండా డబ్బులు తీసుకుని దాదాపు ఆరుగురుకి అవుట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు కల్పించాడని ఆరోపణలు ఉన్నాయన్నారు.హాస్టళ్లలో పనిచేసే ఐదుగురు ఉద్యోగులను తన స్వంత అవసరాలకు ఉపయోగించుకోవడమే గాక, ఒకరి బదులు మరొకరిని డ్యూటి చేయిస్తున్నాడన్నారు.విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే మెస్ బిల్లులో ప్రతి విద్యార్థి నుంచి ప్రతినెల 50 రూపాయలు ఇవ్వాలని హాస్టల్ వార్డెన్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తమ దృష్టికి వచ్చిందన్నారు.విద్యార్థుల కడుపు కొట్టే అధికారులను ఉపేక్షించేది లేదని, జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే అతనిని సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా అధ్యక్షులు వనం తిరుపతయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, ఆర్టీఐ విభాగం అధ్యక్షులు గుర్రం రాఘవేందర్ కొత్తకోట మండల అధ్యక్షులు అంజన్న యాదవ్, ఆత్మకూర్ మండల ప్రధాన కార్యదర్శి అక్కల మల్లేష్ గౌడ్,దేవర శివ, చెలిమిల్ల రామన్ గౌడ్, కిరణ్, వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.





