- సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిస్టులే
- కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి రామచంద్రం
నేటి సాక్షి-హనుమకొండ: జర్నలిస్టులకు ఆకాశమే హద్దు అని, లిమిట్స్ ఉండవని, సమాజాన్ని మేల్కొల్పేది జర్నలిస్టులు మాత్రమే అని కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి. రామచంద్రం అన్నారు. శుక్రవారం కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం విభాగాధిపతి డాక్టర్ సంగని మల్లేశ్వర్ అధ్యక్షతన జరిగిన ఫ్రెషర్స్ డేకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ…జర్నలిజం విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయని సమస్యల మీద ఎప్పటికప్పుడు ముందుంటారని, ఆ సమస్యల పరిష్కారానికి పాటుపడతారన్నారు. విద్యార్థులు భాష నైపుణ్యాన్ని పెంపొందించుకున్నప్పుడు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అబ్బాయిల కంటే అమ్మాయిలకు ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, టీవీ మీడియాలో అమ్మాయిలు ఇప్పుడు ఎక్కువగా కనబడుతున్నారన్నారు. జర్నలిజం విభాగంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని, అన్ని వసతులు కల్పించే విధంగా కృషి చేస్తానన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య టి.మనోహర్ మాట్లాడుతూ…విద్యార్థులు రెగ్యులర్ గా క్లాసులకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో వారి అనుభవాలను రంగరించి ఎన్నో మెలుకువలను తెలుసుకునేందుకు విద్యార్థులు కష్టపడితే విద్యార్థులందరూ కూడా త్వరగా సెటిలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. సిడిఓఈ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ లాల్ మాట్లాడుతూ… అన్ని కోర్సుల కంటే జర్నలిజం కోర్స్ ముఖ్యమైనదని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ సి డైరెక్టర్ ఐలయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మమత, జర్నలిజం విభాగం అధ్యాపకులు డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ సుధాకర్, వెంకటేశ్వర్లు, డాక్టర్ మోటె చిరంజీవి తో పాటు మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





