- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : భద్రకాళి చెరువు పూడిక తీత మట్టిని ఇటుక బట్టీల యజమానులు ఇటుకల తయారీకి, పొలాలను సారవంతం చేసుకునేందుకు రైతులు సద్వినియోగం చేసుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో భద్రకాళి చెరువు పూడికతీత మట్టి తరలింపు, తదితర అంశాలపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి లతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. చెరువు పూడిక తీత ఎంతవరకు వచ్చింది, రోజుకు ఎంత తరలిస్తున్నారు, మట్టి నాణ్యత, ఏవైనా సమస్యలు ఎదురవు తున్నాయా అనే వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. ఈ సందర్భంగా సాగునీటి పారుదల శాఖ ఈఈ శంకర్ మాట్లాడుతూ భద్రకాళీ చెరువు పూడికతీత మట్టిలో ఇప్పటివరకు నాలుగు లక్షల 60 వేల క్యూబిక్ మీటర్లను తీసుకెళ్లేందుకు దరఖాస్తులను తీసుకెళ్లారని అధికారులు తెలిపారు. ఈనెల 28వ తేదీ వరకు గడువు ఉన్నందున మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. అనంతరం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ భద్రకాళి చెరువు పూడికతీత మట్టిని తరలించేందుకు రూట్ సర్వేను శనివారం వరకు పూర్తి చేయాలన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు త్వరిత గతిన మట్టి తీసుకువెళ్లేలా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు పూడికతీత మట్టి తరలించే, మట్టి తీసుకువెళ్లేందుకు వచ్చే వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అప్రోచ్ రోడ్డు ఉండాలన్నారు. వాహనాల రాకపోకలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు తగిన ఏర్పాట్లను చేయాలన్నారు. మట్టి తరలింపునకు మూడు షిఫ్టులలో పూడికతీత మట్టిని తరలించా లన్నారు. మట్టి తరలింపు సందర్భంగా చెక్ పోస్టును ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. ఇటుకల తయారీకి, రైతులు కూడా చెరువు మట్టిని వినియోగించుకోవచ్చునని అన్నారు. చెరువు మట్టి కావాలనుకునే రైతులు, ఇటుక బట్టీల యజమానులు ఇరిగేషన్ అధికారులను సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, కుడా పివో, అజిత్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ, హనుమకొండ తహసిల్దార్ శ్రీపాల్ రెడ్డి, సీఐ సీతా రెడ్డి, మున్సిపల్ డీఈ సంతోష్, మైనింగ్, రవాణా, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.





