- అన్నమయ్య జిల్లా రాయచోటి లో 28602 మంది విద్యార్థులకు మార్చి ఒకటి నుంచి 20 వరకు 49 కేంద్రాలలో పరీక్షలు
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష
- అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవాలి
- జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా ప్రతినిధి భక్త కుమార్ : జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ రాత పరీక్షలను నిర్దిష్ట ప్రణాళిక మేరకు పకడ్బందీగా నిర్వహించి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం రాయచోటి కలెక్టరేట్ నందలి తన ఛాంబర్ లో జిల్లాలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ పై ఆర్ ఐ ఓ కృష్ణయ్య ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు 49 పరీక్ష కేంద్రాలలో నిర్వహించే ఇంటర్ పరీక్షలకు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షా కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ఉంటాయన్నారు. విద్యార్థులందరూ అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం 14855 మంది, రెండవ సంవత్సరం 13747 మంది, మొత్తంగా 28602 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారని చెప్పారు. వీరితోపాటు 2156 మంది ఒకేషనల్ విద్యార్థులు కూడా పరీక్షలు రాస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు సంబంధించి 49 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ లను నియమించినట్లు పేర్కొన్నారు. ఎక్కడా మాస్ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని, కాపీయింగ్ పూర్తిగా అరికట్టాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో ఇంటర్‌నెట్, జిరాక్స్ సెంటర్‌లను మూసి వేయించాలని ఆదేషాలు ఇచ్చారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితులలో విద్యార్థులు సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్, డిజిటల్ పరికరాలు తీసుకువెళ్లరాదన్నారు. పోలీసులు ముందుగా తనిఖీ చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాలలో తాగునీరు, మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్‌లు ఉండేలా అధికారులు చూసుకోవాలన్నారు. పరీక్షలు నిర్వహించే సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అవసరమైన మందులతో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, అలాగే మండలానికి ఒక అంబులెన్స్ సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య శాఖను ఆదేశించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లెందుకు అన్ని రూట్లలో సకాలంలో బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ వారిని, కస్టడీలో ఉన్న ప్రశ్నాపత్రాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖను, పరీక్ష అనంతరం జవాబు పత్రాలను తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని పోస్టల్ శాఖకు సూచించారు. అనంతరం వివిధ అంశాలలో చర్చించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం.వెంకటాద్రి, డిఆర్ఓ మధుసూదన్ రావు, డీఈవో సుబ్రమణ్యం, కమిటీ సభ్యులు ఎం.ప్రకాష్, ఎన్.అమరేంద్ర కుమార, ఓ. నాగ సురేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ చంద్రశేఖర్ రెడ్డి, వైద్య, ఆర్టీసీ, తపాలా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.





