- చెవిరెడ్డికి అడుగడుగునా ఘన స్వాగతం
- శ్రీ కల్యాణ వేంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పణ
- మండు వేసవిలో పాదయాత్రగా వెళ్లి స్వామి దర్శనం

నేటి సాక్షి, తిరుపతి జిల్లా (బాదూరు బాల) : తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం నుంచి చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు అడుగడుగునా అపూర్వ ఆదరణ లభించింది. శనివారం ఉదయం 6 గంటలకు తుమ్మలగుంటలోని కల్యాణ వెంకన్న ఆలయం నుంచి బయలుదేరిన ఆధ్యాత్మిక మహా పాదయాత్ర పేరూరు, తాటితోపు, చెర్లోపల్లి, పుదిపట్ల, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, సి.మల్లవరం, కాలూరు క్రాస్ మీదుగా శ్రీనివాసమంగాపురంకు మధ్యాహ్నం 2గంటలకు చేరుకుంది. గత పాతికేళ్లుగా శ్రీనివాసమంగాపురంలోకి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సేవకు చెవిరెడ్డి పాద యాత్రగా వచ్చి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారు. ఎప్పటిలాగానే స్వామి వారికి పట్టువస్త్రాలు, శేషమాలను పల్లెల్లో ఊరేగిస్తూ ప్రతి పల్లెలో గ్రామపెద్దలు చేత ఆ సారెను మోపిస్తూ భక్తితత్వాన్ని పెంచుతూ ముందుకు సాగారు. భక్తుల గోవింద నామస్మరణలు, భజన బృందాల చెక్కభజనలు, కోలాటాలతో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర కన్నులపండువుగా సాగింది. చెవిరెడ్డితో పాటు భార్య చెవిరెడ్డి లక్ష్మీ, ఆయన కుమారులు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిలు పాదయాత్రకు వచ్చిన వారందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు. పల్లెల్లో కనిపించిన మహిళలు, పెద్దలు, యువకులతో కరచాలనం చేస్తూ వారిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ వారి యోగక్షేమాల గురించి ఆరా తీయడం స్థానికుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మండు వేసవిని సైతం లెక్క చేయకుండా పల్లె ప్రజలు వారితో అడుగులు వేసి ఎక్కడకక్కడి ఊరు దాటించి పాదయాత్రలో పాలుపంచుకున్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు.
తుమ్మలగుంట నుంచి ప్రారంభమైన ఆధ్యాత్మిక పాదయాత్రలో కళాకారులు ప్రదర్శించిన కోలాటాలు, చెక్క భజనలు వివిద రకాల భక్తిపాటలకు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు నిరంతరాయంగా ఆడుతూ పాడుతూ వెళ్లిన కళాకారులు అందరినీ చెవిరెడ్డి అభినందించారు. పాదయాత్రలో నడచి వచ్చిన వారందరికీ స్వామి దర్శనం దగ్గరుండి చేయించారు.
ఆలయ అధికారులకు అప్పగింత.
తుమ్మలగుంట శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి వారి నుంచి చెవిరెడ్డి తీసుకువచ్చిన పట్టువస్త్రాలను శ్రీనివాసమంగాపురంలోని టీటీడీ అధికారులు స్వీకరించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆయనకు స్వాగతం పలికిన అధికారులు స్వామి దర్శనం చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు, వేద ఆశీర్వచనం చేసి అక్షతలతో ఆశీర్వదించారు. అనంతరం పట్టువస్త్రాలను స్వీకరించి స్వామి వారికి వినియోగించే వస్త్రాల దాతల రిజిస్టర్ లో నమోదు చేసుకున్నారు.





