- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రభుత్వ పాఠశాలలు, ఆశ్రమ, గురుకుల పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి జిల్లా విద్యాశాఖ, ఇంటర్మీడియట్, వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి, అల్ప సంఖ్యాక వర్గాల శాఖల అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ఆశ్రమ, గురుకుల పాఠశాలలు, కస్తూరిభా గాంధీ విద్యాలయాలు, వివిధ సంక్షేమశాఖ పరిధిలో కొనసాగుతున్న వసతి గృహాలలో విద్యార్థినీ, విద్యార్థుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సౌకర్యాలు కల్పించడంలో భాగంగా ప్రతి పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, వంటశాలలు, భోజనశాలలు, మూత్రశాలలు, శౌచాలయాలు, ప్రహారీగోడ, అదనపు గదులు ఇతర అన్ని రకాల మౌళిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మైనార్టీ సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల పరిధిలోని పాఠశాలల్లో సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, జిల్లాలోని నెన్నెల, కాసీపేట, హాజీపూర్, జన్నారం, తాండూర్ మండలాల గిరిజన విద్యార్థుల కొరకు ప్రధానమంత్రి జెయుజిఏ పథకం క్రింద నూతన వసతిగృహ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమంపై వసతిగృహాల సంక్షేమ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని, వసతిగృహాలలో విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సహకారం తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ పాఠశాలల భవనాలకు ప్రహారీగోడ ఏర్పాటు చేసేందుకు సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, భోదనేతర సిబ్బంది నిబంధనలు ఉల్లంఘించినట్లయితే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు పోటు రవీందర్ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఏ పురుషోత్తం, జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి, సాంఘిక సంక్షేమశాఖ అధికారి నాగేశ్వర్ రావు, ఇంటర్మీడియట్ విద్యాధికారి అంజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.





