- ఈ స్కూల్లో చేరేందుకు విద్యార్థుల అనాసక్తి
- గత ఏడాది ఉమ్మడి ప్రవేశ పరీక్షకు 1.20 లక్షల దరఖాస్తులు
- ఈ ఏడాది 40 వేలు తగ్గి..80 వేల కే పరిమితం
- వసతుల లేమి, ఫుడ్ పాయిజన్ ఘటనలతో తగ్గుతున్న ఆధరణ
- నేడు అర్హత పరీక్ష
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్): సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపటం లేదు. ఈ పాఠశాలల ప్రారంభ సమయంలో ఒక్కో సీటు కోసం కనీసం నలుగురు విద్యార్థులు పోటీపడగా ఇప్పుడు ఇద్దరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం. ఇటీవల గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు అధికం కావటం, వసతుల లేమి కారణంగా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల పరిధిలోని పాఠశాలల్లో 2025 – 26 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ గత ఏడాది డిసెంబర్ లో విడుదల కాగా, గడువు ముగిసే నాటికి దాదాపు 80 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గురుకులం లో సీట్లు 51 వేలు, దరఖాస్తులు 80 వేలు, రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఇందులో నాలుగు సొసైటీలు సంక్షేమ శాఖలకు అనుబంధంగా కొనసాగుతుండగా జనరల్ సొసైటీ పాఠశాల విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి.
1) (టీ జి ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
2) (టీ టీ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
3) (ఎం జె పి టి బి సి డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్) తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
4) (టి ఆర్ ఈ ఐ ఎస్) లు ఐదో తరగతికి ఉమ్మడిగా ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నాయి. మైనార్టీ గురుకుల సొసైటీ మాత్రం ప్రత్యేకంగా సెట్ నిర్వహించి ప్రవేశాలు చేపడుతుంది. మైనార్టీ సొసైటీ లోని పాఠశాలలు మినహా మిగిలిన నాలుగు సొసైటీ లోని 643 పాఠశాలలో 51, 924 సీట్లు ఉన్నాయి. వీటిలో 5వ తరగతి ప్రవేశాలకు గత ఏడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 6 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 80 వేల లోపే దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోల్చితే ఇవి దాదాపు 40 వేలు తక్కువ. నేడు ఆదివారం అర్హత పరీక్ష నిర్వహించేందుకు ఎస్సి గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం నమోదైన దరఖాస్తుల ప్రకారం ఒక్క సీటు కోసం సగటున 1.6 మంది పోటీ పడుతున్నారు. గురుకుల పాఠశాల ప్రవేశం కోసం గతంలో విపరీతమైన డిమాండ్ ఉండేది. ఒక్కో సీటు కోసం సగటున నలుగురు విద్యార్థులు పోటీ పడేవారు. గత ఏడాది కాలంగా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు భారీగా పెరగటమే డిమాండ్ తగ్గటానికి కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి.





