Monday, March 23, 2026

ఎన్నికల నిర్వహణలో శిక్షణ ముఖ్యమైనది

  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులు, సిబ్బంది పొందుతున్న శిక్షణ ముఖ్యమైనదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించడంలో అధికారులకు, సిబ్బందికి ఇస్తున్న శిక్షణ ముఖ్యమైనదని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను తూచా. తప్పకుండా పాటించి ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని తెలిపారు. పోలింగ్ ఒక రోజు ముందు ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని తెలిపారు. జిల్లాలో పట్టభద్రుల శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుల ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రానికి 300 మీటర్ల వ్యాసార్థం పరిధిలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి ప్రచార సంబంధిత అంశాలు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ సమయంలో బ్యాలెట్ బ్యాక్స్ ల్లో ఉన్న స్లిప్పులు, రిజిస్టర్ లో నమోదు చేసిన వివరాలలో ఎలాంటి బేధాలు ఉండకూడదని, ఓటర్లు, రిజిస్టర్లు, సంతకాలు, పరికరాల ఇతర అన్ని అంశాలలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. పోలింగ్ సమయంలో ఓటర్ల గోప్యతకు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రతి అంశంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఎన్నికలలో పోలింగ్ శాతం పెంపొందించాలని, ఎన్నికల ప్రక్రియపై పిఓలు, ఎపిఓ లకు మాన్యువల్ అందించడం జరుగుతుందని, ఈ మాన్యువల్ ప్రకారంగా ఎన్నికల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగునున్న పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్ లను పోలింగ్ కేంద్రం నుండి స్ట్రాంగ్ రూమ్ కు, అక్కడి నుండి కరీంనగర్ కు తరలించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలవుతున్న సందర్భంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినట్లయితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ క్రింద చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News