Tuesday, March 24, 2026

పశువులకు మేతగా పచ్చటి పొలాలు

  • అడుగంటుతున్న జలాలు, ఆందోళనలో రైతులు
  • పొట్ట దశలో ఎండుతున్న పంటలు
  • సాగు నీరు అందిస్తేనే పంటలు చేతికి

నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): యాసంగిలో ప్రధానంగా సాగు చేస్తున్న పచ్చటి పంట పొలాలు నీరు అందక ఎండిపోతున్నాయి. ఎన్నో ఆశలతో పెట్టుబడి పెట్టి, పొలం దున్ని, వరి నాటు పెట్టి, ఎరువులు చల్లి పంటలు సాగు చేస్తే పొట్టకు వచ్చే దశలో నీరు అందక పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే రైతన్నల గుండెలు తరుక్కుపోతున్నాయి. మండల కేంద్రంలోని ప్రధాన కూడలి సమీపంలో జగిత్యాల-రాజారాంపల్లి రహదారి పక్కన ఓ కౌలు రైతు మూడు ఏకారాలలో వరి పంట వేసి, దీనికి నీరు అందించేందుకు బావిపై ఆధారపడి, మరోవైపు తన పొలంను అనుకుని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉండటంతో సాగు నీరు అందుతుందని ఆశతో సాగు చేశాడు. కానీ అతని ఆశలు అవిరైపోయాయి పంట చేతికి వచ్చే క్రమంలో సాగు నీరు అందక భూగర్భ జలాలు అడుగంటడంతో నీరు అందించలేని పరిస్థితిలో తన పంట ఎండిపోయింది. దీంతో చేసేది ఏమీ లేకా ఆవేదనతో రైతు తన పచ్చని పొలంను పశువులకు మేతగా అందిస్తున్నాడు. అయితే గత రెండు రోజులుగా పశువులు పంటను మేస్తుండటంతో అటుగా ప్రయాణిస్తున్న వారు గమనించి రైతన్న కష్టంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. వేసవికాలం ఎండలు మండటంతో భూగర్భజలాలు అడుగంటి బావులు, బోర్లు ఎండిపోవడం, ప్రధానంగా యాసంగి పంటలు సాగు నీటిపై ఆధారపడి సాగు చేస్తే సక్రమంగా నీరు అందక పోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇకనైనా సాగు నీరు సక్రమంగా అందించక పోతే ఇదే తరహాలో పచ్చటి పంట పొలాలు చేతికొచ్చే దశలో ఎండిపోవడం ఖాయంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనల పట్ల అప్రమత్తమై ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, సంబంధిత ఆధికారులు దృష్టి సారించి పంటలకు సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకుని పంటలు ఎండిపోకుండా కాపాడాలని రైతులు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News