- అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతుండ్రు
- శాసనసభ పక్ష నేత మధుసూదనా చారి

నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ అధికారులు పనిచేస్తున్నారని బీఆర్ఎస్ పక్ష నేత ఎమ్మెల్సీ మధుసూదనా చారి అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పక్ష నేత, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు వివేకానంద, డాక్టర్ సంజయ్ లు రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి ఫిర్యాదు చేశారు. అనంతరం సచివాలయం మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బత్తుల శ్రీనివాస్ కొన్నేళ్లుగా టీస్టాల్ నడుపుతున్నాడాని, కేటీఆర్‌పై అభిమానంతో తన స్టాల్‌కు ‘కేటీఆర్ టీ స్టాల్’గా పేరు పెట్టుకోవడంతో శ్రీనివాస్ టీ షాప్ ను ట్రేడ్ లైసెన్స్ లేదని షాప్ క్లోజ్ చేయడమే కాకుండా.. వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని ఇబ్బందుల గురిచేస్తున్నారని అన్నారు. స్వయంగా సిరిసిల్ల కలెక్టర్ అధికార దర్పంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని భయపెడుతున్నారని అన్నారు. అందుకే సిరిసిల్ల కలెక్టర్‌పై సీఎస్‌కు కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా షాపును క్లోజ్ చేయడం ఏంటని ఆగ్రహించారు. బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్న వారిని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. మొన్న టీ షాపు యజమానిని ఇబ్బంది పెట్టారు. నేడు కార్యకర్తలను ఇబ్బంది పెట్టారు.. ఇలా మొదటిసారి కాదని. రోజూ ఇదే తంతు అని అన్నారు. రాష్ట్రంలో అధికారుల పనితీరుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకొని నియంత్రించాలని విజ్ఞప్తి చేశామన్నారు. నియంత్రించకపోతే బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని తెలిపారు.




