Wednesday, March 25, 2026

వచ్చే విద్యా సంవత్సరానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలి

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ తో కలిసి గ్రామీణాభివృద్ధి, విద్య, షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ, గిరిజన సంక్షేమశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, 2025-26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసించే విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే తయారు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. తరగతుల వారిగా విద్యార్థినీ, విద్యార్థులకు సంబంధించిన కొలతలు తీసుకొని జిల్లాలో గుర్తించబడిన 630 స్వయం సహాయక సంఘాల సభ్యుల సమన్వయంతో ఏకరూప దుస్తుల తయారీ ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఎంబి రికార్డులు పూర్తి అయిన వాటికి చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో సంక్షేమశాఖల పరిధిలో విద్యార్థినీ, విద్యార్థుల సంక్షేమం దిశగా వసతిగృహాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని సంక్షేమ వసతి గృహాలలో తప్పనిసరిగా నిద్ర చేయాలని, విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించాలని, విద్యార్థులకు అందించవలసిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. దినపత్రికలలో ప్రచురితమయ్యే ప్రతికూల వార్తలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు తక్షణమే స్పందించి వివరణ అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News