- జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- లేఅవుట్ ప్లాట్ల క్రమబద్దీకరణ కొరకు ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ -2020 లో వచ్చిన దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిశీలించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్ లో నీటిపారుదల శాఖ ఎఈలు, డివిజనల్ పంచాయతీ అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన, ఆస్తి పన్ను వసూలు, పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల పరిరక్షణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు పనులను వేగవంతం చేయాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ -2020 ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నియమ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక శ్రద్ధ వహించి దరఖాస్తులను పరిశీలించాలని తెలిపారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు రెవెన్యూ రికార్డులను సరి చూసుకోవాలని, అర్హత గల వారికి ఎలాంటి నష్టం కలుగకుండా చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని తెలిపారు. నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగా దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించాలని తెలిపారు. నీటిపారుదల శాఖ పరిధిలో తనిఖీల సమయంలో భూములు నీటి వనరులు, బఫర్ జోన్, ఎఫ్ టి ఏ లలో ఉండకుండా చూడాలని, లే-అవుట్ క్రమబద్ధీకరణ సమయంలో నిబంధనలు తప్పనిసరి పాటించాలని, అప్రోచ్ రోడ్, ప్లాట్ల మధ్య రోడ్లు సరిగా ఉండేలా పరిశీలన చేయాలని, నిషేధిత భూములపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ముందుగా పెండింగ్ దరఖాస్తుల లోకేషన్ ను గుర్తించాలని, అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామపంచాయతీల పరిధిలోని ఆస్తి పన్ను బకాయిలను 100 శాతం వసూలు చేసే విధంగా పంచాయతీ కార్యదర్శులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి తడి చెత్త, పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వేసవి కాలం అయినందున గ్రామాలలోని ప్రతి ఇంటికి త్రాగునీటి సరఫరా సమర్థవంతంగా నిర్వహించాలని, త్రాగునీటి సమస్య లేకుండా పర్యవేక్షించాలని తెలిపారు. వేసవిలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సకాలంలో నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం పంచాయతీ శాఖకు సంబంధించిన డైరీ-2025ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.




