- బిఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం
నేటి సాక్షి, మందమర్రి:- మండలంలోని ప్రభుత్వ భూములను అక్రమార్కులు, రీయల్ ఎస్టేట్ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడి విలువైన ప్రభుత్వ, భూములను పరిరక్షించాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) చెన్నూరు నియోజకవర్గం అధ్యక్షులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ కోరారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ సభావత్ మోతిలాల్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మండలంలోని మందమర్రి శివారు సర్వే నంబర్ 364 లో ఎకరం 30 గుంటలు భూమి రెవెన్యూ రికార్డులలో ప్రభుత్వ భూమిగా ఉందని, సదరు ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్ వేసి ప్లాట్లుగా చేసి అమ్మకాలు జరిపారని ఆరోపించారు. అదే వెంచర్లో కొన్ని సంవత్సరాల క్రితం ఫామ్ హౌస్ నిర్మించారని, అయినప్పటికీ రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారని విమర్శించారు. ఈ ప్రభుత్వ భూమిపై సమగ్ర విచారణ జరిప, ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వ భూమిని కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా పట్టణంలో అనుమతి లేకుండా వెలుస్తున్న అక్రమ వెంచర్లపై రెవెన్యూ, మున్సిపల్ అధికారులు దృష్టి సారించాలని కోరారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అదికారులు విఫలమైతే బీఎస్పీ ఆద్వర్యంలో ప్రజలను కలుపుకొని, ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా నాయకులు వేముల వీరేందర్, దాగామ శ్రీనివాస్, కుమ్మరి కృష్ణ చైతన్య లు పాల్గొన్నారు.




