- ఉమామహేశ్వరరావు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : రామచంద్రాపురం తెలుగు భాషాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించడం హర్షించదగ్గ పరిణామమని రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దొడ్డ ఉమామహేశ్వర్, సుబ్బాల కిరణ్ కుమార్ లు సోమవారం ఒక ప్రకటనలో తెలుపుతూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. బడ్జెట్ కేటాయింపులు కాగితాలకే పరిమితం కాకుండా ఆచరణలో చేసి చూపించాలన్నారు. ప్రతి జిల్లాకు అధికార భాష అమలు కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కోరారు. పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమం పూర్తిస్థాయిలో అమలయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెలువరించే ఉత్తర్వులను తెలుగులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్మీడియట్ స్థాయిలో ద్వితీయ భాషగా అమలవుతున్న తెలుగు భాషను ఐచ్చికంగా కాకుండా తప్పనిసరి చేయాలని వారు పేర్కొన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నాయకులు పట్టాభి రామయ్య, కాటయ్య, చంద్ర ఈశ్వరయ్య, విశ్వనాథం, సుబ్రహ్మణ్యం ఎండి వైదేహి, శ్యామలాదేవి, పి. గోవిందయ్య తదితరులు పాల్గొన్నారు.




