- జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. హరీష్ రాజ్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- లింగ నిర్ధారణ పరీక్ష చట్ట రీత్యా నేరమని, పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు శిక్షార్హులు అవుతారని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా, హరీష్ రాజ్ తెలిపారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయూల భవన సముదాయంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వయిజరీ కమిటీ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి మాట్లాడుతూ, లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని అన్నారు. జిల్లాలో ప్రస్తుతం 52 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఇందులో 5 ప్రభుత్వ ఆధీనంలో, 47 ప్రైవేట్ సెంటర్లు పని చేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి సారించాలని, పరీక్షలు చేయకూడదని, లింగ నిర్ధారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్కానింగ్ సెంటర్లు వైద్యుల వివరాలు, స్కానింగ్ పరికరాల వివరాలు ఆన్లైన్లో పిసిపిఎన్డిటిలో నమోదు చేయాలని, స్కానింగ్ గదిలో ఎలాంటి ఫొటోలు ఉండకూడదని, స్కానింగ్ చేయించుకునే వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లాలో నూతనంగా 5 స్కానింగ్ సెంటర్లు అనుమతించడం జరిగిందని తెలిపారు. పుట్టబోయేది ఆడ బిడ్డ, మగ బిడ్డ అని అడుగవద్దని, ఇది చట్ట రీత్యా నేరమని, లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి, చేయించిన వారికి, ప్రోత్సహించిన వారికి 3 సంవత్సరాల వరకు జైలుశిక్ష, 50 వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. ఆడ పిల్లను కోల్పోతే ఒక తల్లిని, ఒక ఇల్లాలిని, ఒక బామ్మను, ఒక సోదరిని, ఒక స్నేహితురాలిని కోల్పోయినట్లేనని, బ్రూణహత్యలను ఆపేద్దాం ఆడపిల్లను కాపాడుకుందామని అన్నారు. ఆడపిల్లను పుట్టనిద్దాం – బ్రతకనిద్దాం చదవనిద్దాం- ఎదగనిద్దామని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఆశ, ఆరోగ్య కార్యకర్తలు, ప్రజలు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు లింగ నిర్ధారణ పరీక్ష నిరోధంపై నడుము బిగించాలని, అవగాహన కల్పించాలని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లయితే 9440586982 నంబర్లో సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అనంతరం లింగ నిర్ధారణ పరీక్ష నిరోధం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డా, కృపాబాయి, పిఓఎన్సిహెచ్ డా, రాధిక, డా, రాజ్కరణ్, డా, అభినవ్, డా, విక్రమ్, హీల్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఇబ్రహీం, రాంప్రసాద్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాంతారావు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




