- సింగరేణి ఎడ్యుకేషనల్ కార్యదర్శి జి శ్రీనివాస్
నేటి సాక్షి, మందమర్రి:- సింగరేణి విద్యాసంస్థలను సింగరేణి సిఎండి ఎన్ బలరాం ఆదేశానుసారం అత్యుత్తమ సంస్థలుగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషనల్ కార్యదర్శి జి శ్రీనివాస్ తెలిపారు. పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆయన ఏరియా జిఎం జి దేవేందర్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సింగరేణి విద్యాసంస్థలలో తొమ్మిది పాఠశాలలు, ఒక మహిళ జూనియర్ కళాశాల, ఒక మహిళ డిగ్రీ, పీజీ కళాశాల, ఒక పాలిటెక్నిక్ కళాశాలలో మొత్తం 7642 విద్యార్థులతో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సర్వతో ముఖాభివృద్ధికై అకాడమిక్స్, క్రీడలు, అథ్లెటిక్స్, మ్యూజిక్, ఎన్సిసి, స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో యోగ, ద్యానం నేర్పించడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా అధ్యాపకులకు, ఆచార్యులకు ఫ్యాకల్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు. అధ్యాపకులను వివిధ సంస్థలకు పంపి, అక్కడ మంచి పద్ధతులను తెలుసుకొని, సింగరేణి విద్యాసంస్థల్లో ఆచరణ పెట్టడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్పీటీఈఎల్ చాప్టర్ ను ప్రారంభించి, విద్యార్థులను, అధ్యాపకులను అనేక కోర్సులలో నమోదు చేయించడం జరిగిందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను సింగరేణి మహిళ డిగ్రీ కళాశాలకు న్యాక్ అక్రిడేషన్ రావడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలలో కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నామని, పాలిటెక్నిక్ కళాశాలలో ఏఐఎంఎల్ అనే కొత్త కోర్సును ప్రవేశపెడుతున్నామని, దీనితో విద్యార్థులకు అనేక అవకాశాలు వస్తాయని తెలిపారు. అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాలలో ఎన్బీఏ అక్రిడేషన్ కొరకు దరఖాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్, బిట్సాట్ పరీక్షలపై అవగాహన, కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గోదావరి గాని సెక్టార్ త్రీ సింగరేణి పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ లో ఈ సంవత్సరం ప్రారంభించనున్నామన్నారు. పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులతో పేరెంట్స్ అండ్ టీచర్స్ సమావేశం నిర్వహించి, గైర్హాజరు నివారించడం, సమయపాలన పాటించడం తదితర అంశాలను వివరించడం జరుగుతుందని, అదేవిధంగా వారిని మంచి శిక్షణ పద్దతులు, లైఫ్ స్కిల్స్, కమ్యూనికేషన్ ఎలా ఇవ్వాలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సైన్స్ ఫెయిర్, సైన్స్ ఎగ్జిబిషన్, ఎడ్యుకేషన్ టూర్ లకు తీసుకువెళ్ళాడం, విద్యార్థులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించడం జరుగుతుందన్నారు. సింగరేణి మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినీలు, అధ్యాపకులు ఇస్రో స్టార్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగిందని, సింగరేణి విద్యార్థిని, విద్యార్థులు దేశ ప్రధానమంత్రి పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం పాల్గొన్నారని, అదే విధంగా సింగరేణి పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు మొదటిసారిగా సైన్స్, మ్యాథ్స్ ఒలింపియాడ్స్ లో పాల్గొన్నారని, ఇటీవల నిర్వహించిన సీఎం కప్ క్రీడలలో సుమారు 500 మంది సింగరేణి విద్యార్థులు పాల్గొన్నారని గుర్తు చేశారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి, ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతుందని, అందులో భాగంగా వారికి అల్పాహారం, స్నాక్స్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. సింగరేణి మహిళ డిగ్రీ కళాశాల 50 వసంతాలు పూర్తిచేసుకుని, స్వర్ణోత్సవాలు జరుపుకోబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ నరసింహస్వామి, సిసిసి సింగరేణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ దేశాయ్, పట్టణ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జే పురుషోత్తం, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.




