దాడి చేసిన టాస్క్ ఫోర్సు పోలీసులు
23 దుంగలు స్వాధీనం
వాహనం స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లు అరెస్టు
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
జాతీయ రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న 23 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకుని, దానికి కారణమైన ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఎల్. సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణ మేరకు, టాస్క్ ఫోర్సు ఎస్పీ పీ.శ్రీనివాస్ గారి అధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జె. బాలిరెడ్డి గారి మార్గనిర్దేశకత్వంలో ఆర్ఐ బి సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ టి. విష్ణువర్ధన్ కుమార్ టీమ్ బుధవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టారు. ఇందులో భాగంగా అటవీ అధికారులు ఎఫ్ఆర్ఓ ఎస్. మాల్యాద్రి, ఎఫ్బీఓ ఆదిశేషయ్యల సహకారంతో నెల్లూరు-గూడూరు జాతీయ రహదారి చవటపాళ్యం వద్దకు చేరుకుని వాహనాలు తనిఖీ చేపట్టారు. ఆ మార్గంలో ఒక బొలేరో వాహనం అనుమానాస్పదంగా కనిపించడంతో, ఆపి తనిఖీ చేసే ప్రయత్నం చేయగా, అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోసాగారు. వారిని వెంబడించి టాస్క్ ఫోర్సు సిబ్బంది పట్టుకోగలిగారు. వాహనంలో 23ఎర్రచందనం దుంగలు లభించాయి. పట్టుబడిన వారిని చిత్తూరు జిల్లా వాసులుగా గుర్తించి అరెస్టు చేశారు. వారిని దుంగలతో సహా తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ కు తరలించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదు పాల్గొన్న సిబ్బందిని ఎస్పీగారు అభినందించారు.



