జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
జిల్లాలో శాంతిభద్రతలకు అవరోధంగా మారే భూ సంబంధిత సమస్యల పరిష్కారంపై తక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం దిశగా మండల, సబ్-డివిజన్, జిల్లా స్థాయిలలో కమిటీలు ఏర్పాటు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల స్థాయి కమిటీలో తహశిల్దార్, ఎస్హెచ్ఓలు ఉంటారని, నివాస ప్రాంతాలు, నిర్మాణ అనుమతులు, సరైన అనుమతులు లేని అక్రమ కట్టడాలపై మండల పంచాయతీ అధికారి, మున్సిపల్ కమీషనర్లను ప్రత్యేక అధికారులుగా తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మండల కమిటీ ప్రతినిధులు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి రిజిస్టర్ లో వివరాలు నమోదు చేసి గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారని తెలిపారు. దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారించడం జరుగుతుందని, కనీసం 15 రోజులు, గరిష్టంగా 21 రోజులలోగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కోర్టులో పరిష్కారమయ్యే సమస్యలపై సంబంధిత అర్జీదారులకు అవగాహన కల్పించి తగు సూచనలు చేయడం జరుగుతుందని తెలిపారు. మండల పరిధిలోని రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు కమిటీ సూచనలు అనుసరించాలని తెలిపారు. సబ్-డివిజన్ స్థాయిలో రాజస్వ మండల అధికారి, ఎసిపిలు ఉంటారని, మండల స్థాయి కమిటీ పనితీరును 15 రోజులకు ఒకసారి పరిశీలిస్తారని, సమస్యల పరిష్కారంలో మండల కమిటీకి తగు సూచనలు చేస్తారని, డివిజన్ స్థాయిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత మండల స్థాయి కమిటీకి సిఫారసు చేసి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్, డిసిపి ఉంటారని, మండల, సబ్-డివిజన్ స్థాయి దరఖాస్తుల ప్రక్రియపై నెలవారి సమీక్ష నిర్వహిస్తారని, 21 రోజులలో పరిష్కారం కాని దరఖాస్తులను జిల్లా స్థాయి కమిటీకి పంపించాలని తెలిపారు. నకిలీ, తప్పుడు ధృవపత్రాలుగా అనిపించినట్లయితే తదుపరి చర్యల కొరకు జిల్లా స్థాయి కమిటీకి పంపించాలని తెలిపారు. కమిటీల సంబంధిత పనితీరు, ఫిర్యాదులు, సందేహాల నివృత్తి కొరకు జిల్లా స్థాయిలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 08736-250106 నంబర్ ను అందుబాటులో ఉంచడం జరుగుతుందని, ప్రజలు తమ సమస్యలను కమిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కమిటీకి సంబంధించిన అధికారులు నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, విధులలో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.



