నేటి సాక్షి, నరసింహులపేట(భూక్యా రవి): మహిళా దినోత్సవం సందర్భంగా నేడు(శనివారం) ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహిళా సదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ నరసింహులపేట మండల అధ్యక్షుడు వై క్రాంతికుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నర్సింహులపేట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా సదస్సు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా స్త్రీ సామాజిక, ఆర్థిక, రాజకీయ చిత్రపటంలో వ్యవస్థాపరమైన చెప్పుకోదగ్గ మార్పులు కనిపిస్తున్నాయని, దీని వెనుక దశాబ్దాల పోరాటాలు ఉన్నాయన్నారు. స్త్రీలు వ్యక్తిగతంగా లింగ వివక్షకు గురికాకుండా సమాన విద్య, ఉద్యోగ అవకాశాలు అందించడంలో వ్యవస్థాపరమైన మార్పులు వచ్చినప్పటికీ ఇంకా పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం లేదన్నారు. పనివేళల్లో, రవాణాలో, మహిళలు సాఫీగా ఉద్యోగం చేసే, ప్రయాణించే పరిస్థితులు లేకపోవడం బాధాకరమన్నారు. ‘స్త్రీ అభివృద్ధి దేశాభివృద్ధి’ అనే నినాదంతో మార్చి 8న అంతర్జాతీయ మహిళా పోరాట దినాన్ని ఒక సామాజిక బాధ్యతగా టీపీటీఎఫ్ ప్రజల ముందుకు తీసుకొస్తున్నదన్నారు. ఈ మహిళా సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎనమాల శ్రీనివాస్, జిల్లా కౌన్సిలర్ వడ్లూరి వేణుగోపాల్, కోట శేఖర్, స్పెషల్ ఆఫీసర్ స్వప్న, కవితా రాణి, ఇతర మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



