Monday, March 30, 2026

మార్చి 31 చివరి నాటికి 25 శాతం రాయితీ తో ఎల్.ఆర్.ఎస్ చేయించుకొండి

  • ఎల్. ఆర్.ఎస్ లేని వారు మార్చి 31 తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి రాయితీ లేకుండా ప్రస్తుత మార్కెట్ వాల్యూ కు 14 శాతం పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది
  • ఎల్.ఆర్.ఎస్ ఉంటేనే ప్లాటుకు రక్షణ
  • జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : కచ్చా లేఅవుట్లలో ప్లాట్ ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ సదవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి.మార్చి 31 నాటికి కచ్చా లే అవుట్ లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు.శుక్రవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ ఎల్.ఆర్.ఎస్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య తో కలిసి వీసీ లో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ అనుమతి లేని లేఔట్లలో ప్లాట్లు కొన్న వారు తప్పనిసరిగా ఎల్ఆర్ఎస్ పేమెంట్ చేసి క్రమబద్దీకరణ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకోవడానికి 25% రాయితీ కల్పిస్తుందని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా, ఆగస్టు 26, 2020 తర్వాత జరిగినటువంటి సెల్ డీడ్స్, గిఫ్ట్ సెటిల్మెంట్స్, పార్టిషన్ డాక్యుమెంట్స్ లలో ప్లాట్ ఓనర్స్ ఉంటే ఇది వారికి చివరి అవకాశం అని చెప్పారు. ఈ అవకాశం మార్చి 31 తారీకు వరకే ఉందని , ఆ తర్వాత మళ్లీ ఈ డిస్కౌంట్ ఉండదని చెప్పారు. ప్లాట్లను క్రమ బద్దీకరణ చేసుకోకపోతే తర్వాత అమ్మడము, కొనడం వంటివి చేయడానికి వీలుండదని చెప్పారు.జిల్లాలో 48 వేల మంది ఎల్.ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని, కానీ ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 160 మంది మాత్రమే ముందుకు వచ్చి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులందరు పేమెంట్లు చేసి ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునే విధంగా నోటీసులు పంపించాలని, కాల్సు ద్వారా కూడా సమాచారాన్ని తెలియజేయాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. వార్డ్ ఆఫీసర్ల ద్వారా దరఖాస్తుదారులందరికీ ఫోన్లు చేసి సమాచారం అందించాలన్నారు. లే అవుట్ లు చేసిన వారు, ఓనర్లు, ఎల్టిపీలకు, రైటర్ లు, బిల్డర్లు, ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సమాచారం, అవగాహన కల్పించి సకాలంలో ఎల్.ఆర్.ఎస్. చేయించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అవగాహన లేకపోవడం లేదా సమాచారం లేకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోకుంటే రేపటినాడు ఎప్పుడైనా ఎల్.ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటు పై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని, ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్.ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు.మున్సిపల్ కమిషనర్లు, బిల్డర్లు, లే అవుట్ ప్లానర్ లు ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాలని కోరారు.ఎల్ఆర్ఎస్ ద్వారా ప్లాట్ల క్రమబద్దీకరణ చేసుకోవాలనుకునేవారు తమ ఇంటి వద్దనే (lrs.telangana.gov.in) వెబ్సైటు లో సిటిజెన్ లాగిన్ లో తమ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయి పేమెంట్ చేయవచ్చు అన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయానికి, లేదా మున్సిపల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి కూడా ఎల్ఆర్ఎస్ పేమెంట్లు చేయవచ్చని చెప్పారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News