Monday, March 30, 2026

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల, వసతి గృహాన్ని బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి హరికృష్ణతో కలిసి సందర్శించి తరగతి గదులు, వంటశాల, భోజనశాల, ఆర్ఓ ప్లాంట్, విద్యార్థుల గదులు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమంలో భాగంగా డైట్ చార్జీలను 40 శాతం, కాస్మోటిక్ చార్జీలను 200 శాతం పెంచిందని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడంతో పాటు వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, విద్యుత్, మూత్రశాలలు, ప్రహరి గోడ, అదనపు గదులు ఇతర అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులు ఏకాగ్రతతో చదివి పరీక్షలలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని సాధన దిశగా పట్టుదలతో కృషి చేయాలని తెలిపారు. విద్యార్థుల సంక్షేమంలో భాగంగా సంక్షేమ వసతి గృహాలను ఆకస్మికంగా సందర్శించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రోజు ఉదయం విద్యార్థుల ఆరోగ్యం కోసం వ్యాయామం, ధ్యానం చేయాలని తెలిపారు. ఉపాధ్యాయుల హాజరు, విద్యా బోధన, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి వసతి గృహంలో రాత్రి బస చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పోచయ్య, ప్రిన్సిపల్ శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News