- పోలీసుశాఖలో మహిళా అధికారులు అందిస్తున్న సేవలు అభిందనీయం
- వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు
- అన్ని రంగాల్లోనూ అతివలదే పోటీ, వారికి ఎవరు రారు సాటి
- జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపీఎస్

నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా శనివారం రోజు వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ఐపిఎస్ మహిళ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మొదటగా ఎస్పీ మహిళ పోలీసుఅధికారులకు మరియు సిబ్బందికి ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మహిళా పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేయించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహిళలు పలురంగాలలో సాధిస్తున్న విజయాలు రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని, మహిళా అధికారులందరూ ధైర్యంగా ఉండాలని, తమ వృత్తిపరమైన బాధ్యతలను గౌరవంగా నిర్వహించాలని సూచించారు. జిల్లా మహిళా సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఎస్పి తెలిపారు. ప్రస్తుత రోజుల్లో మహిళలు ఏదో ఒక్క రంగంలో అని కాకుండా, విద్య, వైద్య ,పారిశ్రామిక, అంతరిక్ష ఇలా అన్ని రంగాల్లో రాణించడం హర్షనీయమని అన్నారు. మహిళలు బయటకు రానికాలంలో రుద్రమదేవి లాంటి వారు రాజ్యాలను పాలించారని, సరోజని దేవి లాంటి వారు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారని, మహిళలకు రాజకీయాలు అంటే తెలియని కాలంలో ఇందిరాగాంధీ దేశాన్ని పాలించారని అన్ని రంగాల్లోనూ మహిళలదే పోటీ అని, వారికి ఎవరు సాటి రారని కీర్తించారు. మహిళలకు ఓర్పు, సహనం ఎక్కువ, ప్రపంచానికి వెలుగు చూపేది మహిళ అని అన్నారు. పురుషులతో పోటీ పడుతూ ఉద్యోగ అవకాశాల్లో, విధుల్లో వారితో సమానంగా మహిళలు పని చేయడం గొప్ప విషయం అని తెలిపారు. పురుషుల కన్నా మహిళకే పట్టుదల ఎక్కువ అని, కృషితో ఉద్యోగాలలో మరియు ఇతర రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతంగా ఆలోచించిన మహిళ తన కుటుంబాన్ని ఉన్నత స్థాయికి చేర్చే సత్తా ఉందని పేర్కొన్నారు. ప్రత్యేకంగా పోలీస్ శాఖలోశాంతి భద్రతల విషయంలో ఎస్సై నుండి హోమ్ గార్డ్ అధికారి వరకు మహిళ అధికారులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని అన్నారు. తమ విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.మహిళా సాధికారత తోటే అభివృద్ధి సాధ్యం అని, ప్రతి ఒక్క మహిళ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని జిల్లా ఎస్పీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పి ఇన్చార్జ్ అదనపు ఎస్పి ఉమామహేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ,నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, శ్రీనివాస్, అప్పలనాయుడు, షీ టీమ్ ఎస్సై, అంజద్, శిక్షణ ఎస్సైలు, హిమబిందు, దివ్యశ్రీ, భరోసా సెంటర్ కోఆర్డినేటర్, శిరీష, మరియు సిబ్బంది, మహిళ పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



