Monday, March 30, 2026

కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుండి దేశాన్ని పాలించే వరకు మహిళల పాత్ర కీలకమైనది

  • జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:– కుటుంబాన్ని తీర్చిదిద్దడం నుండి దేశాన్ని పాలించే వరకు అన్ని రంగాలలో మహిళల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో డిసిపి ఎ భాస్కర్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖన్ లతో కలిసి హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మహిళలు సామాజికంగా ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని, దేశం ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఎఎస్, ఐపిఎస్, ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని, ప్రతి రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్న మహిళలు సాధిస్తున్న విజయాలకు గుర్తించి మరింత ప్రోత్సాహించాలని అన్నారు. లింగ బేధం లేకుండా అబ్బాయిలను, అమ్మాయిలను ఒకేలా చూస్తూ సమాన అవకాశాలు కల్పించాలని, తద్వారా మహిళలు ఎదగడానికి ఎక్కువ అవకాశాలు అందించడం జరుగుతుందని తెలిపారు.

ఓర్పు, సహనంతో కుటుంబాన్ని తీర్చిదిద్దడంతో పాటు సంస్కారం కలిగిన భావితరాలను అందించడంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. మహిళలకు ఆత్మస్థైర్యమే గొప్ప ఆయుధమని, మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక భద్రతా చర్యలు చేపడుతుందని తెలిపారు. ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందే దిశగా ప్రోత్సహిస్తుందని, అన్ని రంగాలలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక స్వావలంబన పొందడంలో అనేక అవకాశాలు కల్పించడం జరుగుతుందని తెలిపారు. అనంతరం జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన మహిళా అధికారులు, ఉద్యోగులను ప్రశంసా పత్రాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News