Monday, March 30, 2026

జనావాసాల మధ్య మద్యం షాపు వద్దే.. వద్దు.!

  • సాయినగర్ కాలనీ వాసుల గగ్గోలు
  • తక్షణమే తరలించాలంటూ డిమాండ్
  • అధికారులు స్పందించకుంటే ఉద్యమం ఉధృతం చేస్తాం
  • సీపీఐ నగర కార్యదర్శి జల్లా విశ్వనాథ్ హెచ్చరిక

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : అధికంగా నివాసాలుంటున్న ప్రాంతమది. అక్కడే ఆసుపత్రి, పాఠశాల, బ్యాంకులు, మహిళల హాస్టళ్లు ఉన్నాయి. నిత్యం విద్యార్థులు, ప్రజలు, మహిళలు తిరుగుతుంటారు. నిత్యం రద్దీగా ఉండే నగరంలోని బైరాగిపట్టెడ (సాయినగర్ పంచాయతీ) ఏరియాలో అధికారులు వైన్ షాపునకు అనుమతులు ఇచ్చేశారు. దీంతో అక్కడ ‘ఫ్రెండ్లీ వైన్ షాప్’ పేరిట దుకాణం ఏర్పాటైంది. జనవాసాల మధ్య
వైన్ షాపు ఉండడంతో మందుబాబుల చేష్టల వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలనీ వాసులు విషయాన్ని సీపీఐ నేతల దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజులుగా అక్కడి నుంచి దుకాణాన్ని తొలగించాలని వివిధ ప్రజా సంఘాల నేతలు ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. నగరంలోని బైరాగిపట్టెడ సర్కిల్ అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. సర్కిల్ కి సమీపంలో సాయినగర్ పంచాయతీ పరిధిలో బ్యాంకులు, ఆసుపత్రులకు నెలవైయ్యాయి. అలాంటి చోట అధికారులు వైన్ షాప్ నకు అనుమతలిచ్చారు. ‘ఫ్రెండ్లీ వైన్ షాప్’ పేరిట అక్కడి నిర్వాహకులు దుకాణాన్ని తెరిచారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో మందుబాబుల ఎక్కువైయ్యారు. వారి చేష్టలకు అటుగా వెళుతున్న ప్రజలు, స్థానికులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుకాణదారులు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్థానికులు విషయాన్ని సిపిఐ నేతల దృష్టికి తీసుకొచ్చారు. దుకాణాన్ని జనవాసాల నుంచి మరోచోట ఏర్పాటు చేయాలని నిర్వాహకులను నేతలు హెచ్చరించినా ఫలితం లేకపోయింది. దీంతో దశల వారీ పోరుకు సిద్ధమైయ్యారు. గత వారం రోజులుగా సీపీఐ అనుబంధ సంఘాల నేతలు, స్థానికులతో కలసి వైన్ షాప్ వద్ద నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు.

వైన్ షాప్ నిర్వహణ ఆపాలంటున్న మహిళలు..
సాయినగర్ ఫ్రెండ్లీ వైన్ షాప్ పక్కనే సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతి ఉంది. ఇంకొంత సమీపంలోనే ఇండియన్ బ్యాంకు ఉంది. ఆ బ్యాంకు వద్ద నిత్యం డ్వాక్రా మహిళలు వస్తూపోతూ ఉంటారు. దుకాణానికి ఎదురుగా ఉన్న వీధిలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లు ఉన్నాయి. అదే దారిలో నాలుగు పాఠశాలలు ఉండడంతో పాఠశాల విద్యార్థులు వస్తూ వెళుతుంటారు. వైన్ షాప్ నకు ఆనుకొని నివాస సముదాయాలు ఉన్నాయి. అంత రద్దీగా ఉంటున్న
ప్రాంతంలో అధికారులు దుకాణానికి అనుమతులు ఇవ్వడంపై మహిళలు తీవ్ర ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్కడి నుంచి వైన్ షాప్ ను తరలించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటూ హెచ్చరిస్తున్నారు. నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు ఎలా అనుమతులిస్తారంటూ అధికారులపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా స్పందిచకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేపడతామని సాయి నగర్ వాసులు మండిపడుతున్నారు.

అనుమతులు లేకున్నా.. షాప్ వెనుకల సిట్టింగ్..
దుకాణాల వద్ద మందుబాబులకు సిట్టింగ్ కు ప్రభుత్వం అనుమతించలేదు. అయినప్పటికీ నిర్వహణ దారులు ఇష్టారీతిన దుకాణం వెనుకల సిట్టింగ్ ఏర్పాటు చేసి మందుబాబులకు ఏర్పాట్లు చేశారు. అక్కడే తాగి రోడ్డుపై వెళుతున్న ప్రజలకు మందుబాబులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళలు, పాఠశాల విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బ్యాంకులకు వస్తున్న ప్రజలు, ఆసుప్రతికి వస్తున్న రోగులు
మందు బాబుల చేష్టలకు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.

స్థానిక ఎమ్మెల్యేపై ఆగ్రహం
సాయి నగర్ నివాస ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందిచక పోవడంపై సాయినగర్ వాసులు మండిపడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా మరో ప్రాంతానికి దుకాణాన్ని తరలించే చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోవడం దుకాణ నిర్వహణ దారులకు ఎమ్మెల్యే వత్తాసు పలకడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ మద్యం పాలసీపై విమర్శించి అధికారాన్ని చేపట్టిన కూటమి నేతలు అధికారం రాగానే ప్రజల ఇబ్బందులను గాలికొదిలేయం సరికాదని, ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించకుంటే భవిష్యత్ లో తగిన రీతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని దుమ్మెత్తిపోస్తున్నారు.

తక్షణమే అధికారులు స్పందించాలి..
నివాస ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు అనుమతులివ్వడం సిగ్గు సిగ్గు. అధికారులు పున:పరిశీలించి దుకాణాన్ని మరో చోటుకి తరలించాలి. విద్యార్థులు, మహిళలు, స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తాం.

  • ఎం. రామకృష్ణ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి

వెయ్యి మంది మహిళలతో ధర్నా చేస్తాం..
అధికారులు తక్షణమే స్పందించి మద్యం దుకాణాన్ని సాయినగర్ ప్రాంతం నుంచి మరో చోటుకి తరలించాలి. స్థానికులతో పాటు, మహిళలు, పాఠశాల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. నివాసప్రాంతాల్లో మద్యం షాపు నకు అనుమతులు ఎలా ఇస్తారు? ఇప్పటికై స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే త్వరలో వెయ్యి మంది మహిళలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపడతాం – నదియ

ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకోరా..
జనావాసాల మధ్యనున్న ఫ్రెండ్లీ వైన్ షాప్ వల్ల స్థానికులు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మందుబాబుల చేష్టలకు విస్తుపోతున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు స్పందించకపోవడం దారుణం. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి దుకాణాన్ని ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతానికి తరలించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News