- వెల్లడించిన వైసీపీ ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి
నేటి సాక్షి తిరుపతి న్యూస్ తిరుపతి రిపోర్టర్ : భారత సముద్ర వాణిజ్యానికి మహర్దశ పట్టనుందని వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి అన్నారు. ఇందుకు బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు-2024 ఎంతగానో ఉపకరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ బిల్లుపై చర్చలో భాగంగా గురుమూర్తి మాట్లాడుతూ కొన్ని సవరణలు మినహా, సంపూర్ణ మద్దతు తమ పార్టీ తరపున ఇస్తున్నామన్నారు. ఈ బిల్లు కారణంగా సముద్ర వాణిజ్యంలో సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చన్నారు. అలాగే దేశ సముద్ర చట్టాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్చడమే లక్ష్యంగా బిల్స్ ఆఫ్ లేడింగ్ బిల్లు-2024 ప్రవేశ పెట్టారన్నారు. బిల్లు ఆమోదం పొందడం ద్వారా వాణిజ్య రంగాన్ని ఆధునీకరించి ప్రపంచ మార్కెట్‌లో మన దేశం పోటీకి సిద్ధమవుతుందన్నారు. అలాగే వివాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. మేక్ ఇన్ ఇండియా లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా బిల్లులోని అంశాలున్నాయని ఆయన కొనియాడారు. భారతదేశంలోనే రెండో అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఆయన అన్నారు. ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యుడిగా, దేశ సముద్ర వాణిజ్యాన్ని బలోపేతం చేయడానికి ఈ చట్టం ఆవశ్యకతను తాము గుర్తించామని ఆయన చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో, ఆంధ్రప్రదేశ్ బ్లూ ఎకానమీ పెంచడానికి అనేక చర్యలు తీసుకుని గణనీయమైన వృద్ధిని సాంధించిందన్నారు. ఇందులో భాగంగానే భావనపాడు , మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల అభివృద్ధి చేయడంతోపాటు తొమ్మిది ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధితో ₹9,000 కోట్ల స్థూల విలువ జోడించబడి లక్ష మందికి ఉపాధి లభించిందని డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తిరుపతి పార్లమెంటు పరిధిలోని దుగరాజపట్నం పోర్టు నిర్మాణం గురించి గురుమూర్తి మాట్లాడుతూ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న దుగరాజపట్నం నౌకాశ్రయ అభివృద్ధి ఇంకా ప్రారంభం కాలేదన్నారు. 2018 నాటికే మొదటి దశ నిర్మాణం పూర్తి కావాల్సి వుండిందన్నారు. ఇప్పటికీ ఎలాంటి అబివృద్దికి నోచుకోలేదని లోక్‌సభ దృష్టికి ఆయన తీసుకెళ్లారు. దీనిని తక్షణమే ప్రారంభించి, రాష్ట్ర సముద్ర వాణిజ్య అభివృద్ధిని వేగవంతం చేయాలని కోరారు. అలాగే బిల్లులో చేయాల్సిన సవరణల్ని కూడా ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి నేరుగా ఆదేశాలివ్వడానికి అధికారం ఇస్తూ బిల్లులో చేర్చినప్పటికీ, వీటి పరిమితులు, ప్రత్యేకతలు కొరవడటం వల్ల అధికార దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకోకపోవడం లోపంగా కనిపిస్తోందన్నారు. ఈ-బిల్స్ ఆఫ్ లేడింగ్ అమలు చేయడం ద్వారా సముద్ర రవాణా మెరుగుపడుతుందని అన్నారు. బిల్లులో నిజమైన హోల్డర్ల హక్కులను గుర్తించినప్పటికీ, బిల్లుల బదిలీలో మోసం లేదా తప్పుదోవ పట్టించే చర్యలపై సరైన రక్షణ చర్యలు లేవని ఆయన అన్నారు. వివాదాల పరిష్కారం గురించి తగినంత వివరంగా చర్చించలేదన్నారు. అందువల్ల రవాణాదారులు, కొనుగోలుదారులు, ఇతరులకు హక్కులు, బాధ్యతలపై వివాదాలు నెలకొనే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సరైన మౌలిక సదుపాయాలు, సమన్వయంపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు రూపొందించాల్సిన అవసరం వుందని ఆయన గుర్తు చేస్తూ డాక్టర్ గురుమూర్తి ప్రసంగాన్ని ముగించారు.



