
నేటి సాక్షి, మందమర్రి:- ప్రపంచంలో అత్యధిక డిజిటల్ చెల్లింపులు జరిపే దేశాల్లో భారతదేశం ముందుందని, ఇందుకు పొదుపు సంఘాల మహిళలు సైతం కారణమని పట్టణ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శివకుమార్ తెలిపారు. మండలంలోని చిర్రకుంట గ్రామంలో స్వయం సహాయక బృందాల సభ్యులకు, రైతులకు డిజిటల్ చెల్లింపులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు బిఎల్ రాయుడు, ఎమ్ హరీష్ లు హాజరై, డిజిటల్ చెల్లింపుల వలన ప్రయోజనాలు, నగదు రహిత చెల్లింపులు జరిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ విస్తరణ అధికారి ముత్యం తిరుపతి మాట్లాడుతూ, నగదు రహిత లావాదేవిలతో డిజిటల్ యుగంలో కొత్త అధ్యాయం మొదలైందని, ఇప్పుడు రైతులు సైతం వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్లో అమ్మేటప్పుడు, విత్తనాలు, ఎరువులు తదితర అవసరాలకు డిజిటల్ విధానాల తోనే చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం సిసి చారి మాట్లాడుతూ, డిజిటల్ లావాదేవి లు జరిపేటప్పుడు పాస్వర్డ్ విషయంలో గోప్యత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ అధికారి రాజేష్, గందె రాంచందర్, రైతులు, మహిళలు పాల్గొన్నారు.



