Tuesday, March 31, 2026

బొగ్గు, క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లో పరస్పర సహకారం

  • ఎన్ఎండిసి, సింగరేణి నిర్ణయం

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- బొగ్గు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి దేశ అవసరాల దృష్ట్యా క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లోకి అడుగు పెట్టాలని కృత నిశ్చయంతో ఉందని, ఈ నేపథ్యంలో గత 60 ఏళ్లుగా ఖనిజాల ఉత్పత్తిలో అంతర్జాతీయ అనుభవం ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసి) తో కలిసి నడిచేందుకు సంసిద్ధంగా ఉన్నామని సింగరేణి సిఎండీ ఎన్ బలరామ్ తెలిపారు. సోమవారం సాయంత్రం సింగరేణి డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో కలిసి ఎన్ఎండిసి సిఎండీ అమితావ ముఖర్జీ, ఆ సంస్థ డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విదేశాల్లో క్రిటికల్ మినరల్స్, ఇతర ఖనిజాల మైనింగ్ లో అపార అనుభవం ఉన్న ఎన్ఎండిసి సహకారం తమకు ఎంతగానో దోహదపడుతుందని సింగరేణి సిఎండి ఎన్ బలరామ్ అభిప్రాయ పడ్డారు. క్రిటికల్ మినరల్స్ మైనింగ్ లో మేథో విజ్ఞానాన్ని పంచుకునేందుకు ఐఐటీ- హైదరాబాద్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సాంకేతికత, మానవ వనరులపై ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపడుతున్న సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఎన్ఎండిసి సిఎండి అమితావ ముఖర్జీ మాట్లాడుతూ, దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో సింగరేణి, ఖనిజ వనరులను జాతికి అందించేందుకు ఎన్ఎండిసి లు దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణికి సహకరించేందుకు ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటామన్నారు. రానున్న రోజుల్లో తాము చేపట్టబోయే ప్రాజెక్టుల్లో సింగరేణిని సహ భాగస్వామిగా చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. అలాగే జార్ఖండ్ లో తమకు దక్కిన బొగ్గు బ్లాక్ లోనూ అవ‌స‌ర‌మైతే సింగరేణి సహకారం తీసుకుంటామన్నారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్ఎండిసి డైరెక్టర్ కమర్షియల్ విశ్వనాథ సురేశ్, డైరెక్టర్ టెక్నికల్ వినయ్ కుమార్, డైరెక్టర్ ప్రొడక్షన్ జయ్ దీప్ దాస్ గుప్తా, డైరెక్టర్ పర్సనల్ ప్రియదర్శిణి గడ్డం, సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ పి అండ్ పి కె వెంకటేశ్వర్లు, కోల్ మూమెంట్ ఈడీ ఎస్డీ ఎం సుభానీ, ఫైనాన్స్ జిఎం సుబ్బారావు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News