Tuesday, March 31, 2026

యువత పోరు..వైఎస్ఆర్ సీపీ జోరు..!

  • పార్టీ శ్రేణులతో హోరెత్తిన తిరుపతి కలెక్టర్ కార్యాలయం
  • పోలీసు వలయం దాటుకుని వచ్చిన విద్యార్థులు
  • కలెక్టర్ ను కలసి వినతి పత్రం అందించిన నేతలు
  • కూటమి సర్కారుపై ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరిక
  • ఇచ్చిన హామీలు అమలు చేయాలని భూమన డిమాండ్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : ఫీజు రీయంబర్స్ మెంట్, నిరుద్యోగ బృతిని వెంటనే విడుదల చేయాలని, మెడికల్ కాలేజీల ప్రయివేటీ కరణ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన యువత పోరు విజయవంతమైంది. యువత పోరుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై నిరసనలతో హోరెత్తించారు. తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వందల సంఖ్యలో పోలీసులు వలయంగా చుట్టుముట్టగా పోలీసు వలయాన్ని దాటుకుని విద్యార్థులు గేటు వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయంబర్స్ మెంట్ విడుదల చేయకపోవడంతో తమకు పరీక్షలు రాయడానికి అవకాశం లేకుండా కాలేజీల యాజమాన్యం హాల్ టిక్కెట్టులు ఇవ్వడం లేదని బాధిత విద్యార్థులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ అధ్యక్షులు డాక్టర్ శిరీషా, తిరుపతి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త మేకతోటి రాజేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డిల ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, యువత, విద్యార్థి సంఘం నేతలు, బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. బుధవారం ఉదయం 8గంటల నుంచే పోలీసులు ఆ పరిసర ప్రాంతాలను చుట్టుముట్టి ఎక్కడికక్కడ నిర్భందం చేసినప్పటికీ ఊహించని స్థాయిలో పార్టీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం చేసిన మోసం, నిరుద్యోగ యువతను చంద్రబాబు సర్కారు చేసి నయవంచనను ఎండగట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో పోరాటాలతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు. ఆ తరువాత విద్యార్థులకు, యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ప్లకార్డులను ప్రదర్శించారు. ఆపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనికి వెళ్లి యువత పోరు ఎందుకు చేయాల్సి వచ్చిందని, ప్రభుత్వం చేయవలసిన పనులు ఏమిటన్న విషయాలను విసదీకరించి రాసిన లేఖను కలెక్టర్ వెంకటేశ్వర్ కు అందించారు.

న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం

కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి, అధికారం కోసం అడ్డమైన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాక పేద ప్రజలను మోసం చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదు.. ప్రభుత్వం నుంచి పేదలకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటాం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలతోనే పుట్టింది.. జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని ఎంతమంది ఎన్నిరకాలుగా ఇబ్బందులు పెట్టినా లెక్క చేయకుండా ప్రతి కార్యకర్త కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అరాచకాలను ప్రశ్నిస్తాం. బాధితుల పక్షాన నిలబడి పోరాడుతాం. ఇందులో ఎటువంటి అనుమానాలు వద్దు. ప్రజలకు మేలు కలిగించడానికి ఎంతవరకైనా పోరాడుతామని చెబుతున్నాం. అంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు వివరించారు. అలాగే చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉన్నత చదువులను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని, ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరుద్యోగ బృతి ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వానికి కళ్లు తెరిపించేంత వరకు పోరాడుతామని, పోరాటం తమకు కొత్తకాదన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి ఉద్యమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కనుక ఆయన నాయకత్వంలో ఉద్యమించేందుకు తాము ఎప్పటికీ సిద్ధంగానే ఉంటామని, కూటమి ప్రభుత్వం తక్షణం స్పందించి పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చివరగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు, అబద్ధాలతో యువత అన్యాయమైపోయిందన్నారు. ఆర్థికంగా పడరాని పాట్లు పడుతూ ఉన్నత విద్యను పూర్తి చేయలేక, ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల కక్షపూరిత విధానాన్ని వదిలిపెట్టి వారిని ఆదుకునేలా నిధులు విడుదల చేయాలన్నారు. ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలను బెదిరించి పబ్బం గడుపుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలివచ్చారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News