- అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయి
నేటి సాక్షి-కరీంనగర్: అనధికార లే ఔట్ల క్రమబద్దీకరణకు, ప్లాట్ల రెగ్యులరైజేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ 25 శాతం రాయితీ అవకాశాన్ని జిల్లాలోని అర్హులైన వారందరూ గడువులోగా సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్టర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు, కార్యదర్శులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎల్ఆర్ఎస్ పై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం కొన్ని నూతన నిర్ణయాలు తీసుకుందని అన్నారు. ఎఫ్.టి.ఎల్, నిషేధించిన సర్వే నెంబర్లు మినహా ఎల్. ఆర్. ఎస్ కు దరఖాస్తు చేసుకున్న అందరికీ రెగ్యులరైజేషన్ రుసుము నిర్ణయించామని తెలిపారు. రుసుము ఎంత అనేది ఎవరైనా తమ సెల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి పరిశీలించవచ్చని అన్నారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తుదారులు ఎవరైనా ఈనెల 31వ తేదీ లోగా చెల్లిస్తే 25 శాతం మినహాయింపు ఉంటుందని తెలిపారు. రుసుము చెల్లించిన వారి దరఖాస్తు అధికారులు పరిశీలించి రెండు రోజుల్లోనే అనుమతి మంజూరు చేస్తారని తెలిపారు. అనధికారికంగా లేఅవుట్లు చేసి అందులో 10 శాతం ప్లాట్లను విక్రయించిన వారికి మిగతా ఫ్లాట్లను క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉందన్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించి క్రమబద్దీకరణ చేసుకోవచ్చని తెలిపారు. క్రమబద్ధీకరించని భూములలో ఎటువంటి రిజిస్ట్రేషన్లకు, నిర్మాణాలకు అనుమతించడం ఉండదని తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా క్రమబద్దీకరణ చేసుకోవాలని, ఈ నెల 31వ తేదీ వరకు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకొని 25% రాయితీ పొందాలని తెలిపారు. జిల్లాలో 68,405 ఎల్.ఆర్.ఎస్ దరఖాస్తులు రాగా 44,437 ఆమోదం పొందాయని తెలిపారు. కార్యదర్శులు, వార్డు స్థాయి అధికారులు ఎల్ ఆర్ ఎస్ రాయితీపట్ల ప్రజలకు విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. ప్రతి గ్రామపంచాయతీలలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. క్రమబద్ధీకరణకు రుసుము నిర్ణయించిన వారందరికీ సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సుడా డిటిసిపిఓ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్లు సబ్ రిజిస్టార్లు పాల్గొన్నారు.





