- కార్డులపై దివ్యాంగులకు అవగాహన కల్పించాలి
- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి-కరీంనగర్:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే వివిధ రకాల ప్రయోజనాలు పొందేందుకు యు.డి.ఐ.డి కార్డు ఉపకరిస్తుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. మహిళలు, పిల్లలు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో యుడిఐడి కార్డులపై అవగాహన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇదివరకే సదరం సర్టిఫికెట్ ఉన్నవాళ్లు తిరిగి యు డి ఐ డి లో దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని అన్నారు. వారికి ఆన్లైన్ నందు యు డి ఐ డి కార్డు జనరేట్ చేయబడి పోస్టులో నేరుగా వస్తుందని తెలిపారు. కొత్తగా సదరం కోసం నమోదు చేసుకోవాలనుకునే వారు మాత్రమే యూ డి ఐ డి పోర్టల్ నందు ఆన్లైన్ దరఖాస్తు చేయాలని తెలిపారు. www.swavlambancrad.gov.in పోర్టల్ నందు దరఖాస్తు చేయాలని తెలిపారు. మొత్తం 21 రకాల అంగవైకల్యం ఉన్నవారికి కార్డు జారీ అవుతుందని అన్నారు. ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తును అధికారులు పరిశీలించి, వైద్య పరీక్షలు నిర్వహించి కార్డు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్డు పోస్టులో దరఖాస్తుదారు ఇంటికి నేరుగా వస్తుందని అన్నారు. కార్డు కోసం వ్యక్తిగతంగా ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, ఆన్లైన్ పై అవగాహన లేని వాళ్ళు మీ సేవ సెంటర్ లోనూ దరఖాస్తు సమర్పించవచ్చని సూచించారు. యూ డి ఐ డి కార్డు మంజూరు కోసం ఎవరికీ సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు. కార్డు ఇప్పిస్తామని ఎవరైనా డబ్బు డిమాండ్ చేస్తే హెల్ప్ లైన్ నెంబర్ 9490881098 కు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. యూ డి ఐ డి కార్డుల పట్ల దివ్యాంగ సంఘాల నాయకులు ప్రతి దివ్యాంగుడికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా సంక్షేమ అధికారి సబిత, డి ఆర్ డి ఓ శ్రీధర్, డీఈవో జనార్ధన్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు, దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, మీసేవ సెంటర్ల నిర్వాహకులు, దివ్యాంగులు పాల్గొన్నారు.





