నేటి సాక్షి ప్రతినిధి వనపర్తి జిల్లా : సాహితీ కళా వేదిక, తెలంగాణ వికాస సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారుడు దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవ సన్నాహక సమావేశం శుక్రవారం వనపర్తిలో జరిగింది. ఈ నెల 29వ తేదీ, సాయంత్రం 4 గంటలకు “దాశరథి కృష్ణమాచార్య శత జయంతి వేడుకలు” స్థానిక దాచా లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో ప్రధాన వక్తగా కవి, గాయకుడు, శాసనమండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, సహావక్తగా సుప్రసిద్ధ సాహితీవేత్త డా. కోయి కోటేశ్వర రావు ఇతర సాహితీవేత్తలు హాజరవుతారని తెలిపారు. కవిగా, తొలితరం తెలంగాణ ఉద్యమ పోరాట యోధుడిగా దాశరథి కృష్ణమాచార్య సాహిత్యం, జీవన ప్రస్థానం గురించి నేటితరానికి వివరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు సాహితీ వేత్తలను సన్మానించనున్నట్లు వారు తెలిపారు. ఈనాటి కార్య క్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పలుస శంకర్ గౌడ్, కందూరు నారాయణ రెడ్డి,నాగవరం బాల్ రాం, డా. కె.వీరయ్య, సత్తార్, చిన్నమ్మ థామస్, బైరోజు చంద్ర శేఖర్, బండారు శ్రీనివాస్, డా. తూర్పింటి నరేష్ కుమార్, నందిమళ్ళ రాములు, గంధం రాజు, ఆవుల రమేష్, శ్రీ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.





