Wednesday, April 1, 2026

వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరగాలి

  • సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం పెరిగినప్పుడే నాణ్యమైన వస్తువులు వాస్తవమైన ధరలకు లభిస్తాయని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజలింగు మోతే అన్నారు. శనివారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని వస్తువులు, తూకాల్లో తేడాలు ఇలా మార్కెట్లో రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయని అన్నారు. వ్యాపారులు, వ్యాపార సంస్థలు వినియోగదారులను బురిడీ కొట్టిస్తున్నాయని తెలిపారు. కొనుగోళ్లు, సేవాలోపంతో పలువురు నష్టపోతున్నారని అన్నారు. చాలామందికి న్యాయం పొందే మార్గం తెలియకపోవడం, చట్టాలపై అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వినియోగదారులు తమకు జరిగిన అన్యాయాన్ని తెలుగులో సమగ్రంగా రాసి వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఫిర్యాదు తో పాటు కొనుగోలుకు సంబంధించిన రసీదు, హామీ పత్రం జత చేయాలన్నారు. వినియోగదారుల కమిషన్ ఆదిలాబాద్ జిల్లాలో ఉందన్నారు. బాధితుడు న్యాయవాది ద్వారా లేదా స్వయంగా కమిషన్ ను ఆశ్రయించవచ్చని అన్నారు. బాధితుడు తానే స్వయంగా వాదించుకునే అవకాశం ఉందన్నారు. జరిగిన నష్టం గానీ, వస్తు విలువ ఐదు లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటే నామమాత్రపు రుసుము ఉంటుందన్నారు. నష్టం జరిగిన రెండేళ్లలోపు వరకు కమిషన్ ను సంప్రదించవచ్చని అన్నారు. కమీషన్ దీనిపై విచారించి 30 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తుందని తెలిపారు. తీర్పు అనంతరం మరో అప్పీల్ కు అవకాశం ఉండదన్నారు. కోర్టు ఆదేశాలు పాటించకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుందన్నారు. వినియోగదారుడు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేసి తనకు జరిగిన నష్టానికి తగిన పరిహారాన్ని పొందవచ్చని అన్నారు. వినియోగదారుల హక్కులకు రక్షణ కల్పించి సమాజంలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు కల్లూరు క్రాంతి కుమార్ పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News