Wednesday, April 1, 2026

ఆదివాసి కుటుంబాలకు పోలీసుల అండ

  • వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం
  • మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్
  • బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్

నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
ఆదివాసి కుటుంబాలకు పోలీసులు అండగా ఉంటారని, ఆదివాసీలు ఉన్నత విద్యను అభ్యసించి, ఉన్నత స్థాయిలో ఉండాలని, వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యం అని మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్, ఐపీఎస్, బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ లు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జోన్ మాదారం పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ (బెజ్జాల) గ్రామంలో తాండూర్ సర్కిల్ పోలీస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన రాబిన్ హుడ్ ఆర్మీ, స్లో మ్యాన్ వారి సహకారంతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 3 ఇంక్లైన్, 5 ఇంక్లైన్, నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని గూడెంలకు చెందిన 365 కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమపిండి, 2 కిలోల పప్పును పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపిఎస్, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులను ఆదివాసి పెద్దలు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంచిర్యాల డిసీపీ ఏ భాస్కర్, ఐపిఎస్ మాట్లాడుతూ, ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయమని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఎన్నో సౌకర్యాలు మెరుగు పడ్డాయని, తల్లిదండ్రులు అందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకుని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సౌకర్యాలను సద్వినియొగం చేసుకోవాలన్నారు. గిరిజనులకు ఎల్లవేళలా క్షేత్రస్థాయి పోలీస్ అధికారులు అందుబాటులో ఉండి, వారికి ప్రతి విషయంలో తోడ్పాటును అందిస్తూ, వారి ఉన్నతికి ఎల్లప్పుడూ కృషి చేస్తారని తెలిపారు. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, కొన్ని సంఘ విద్రోహ శక్తులు వారిని ప్రలోభాలకు గురిచేసి, చెడు మార్గం వైపు నడిచేలా ప్రోత్సహిస్తారని, వారి ప్రలోభాలకు లొంగకుండా మంచిని ఎంచుకుని, సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. ఎటువంటి కష్టం వచ్చినా ఎల్లవేళలా పోలీస్ శాఖ వారికి అందుబాటులో ఉంటుందని పోలీసులను సంప్రదించాలన్నారు. ఆదివాసులు అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని, గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలీసులకు తెలియచేయాలని తెలిపారు. గత సంవత్సరంలో ఈ ప్రాంతం వారికి హైదరాబాద్ చెందిన రాబిన్ వుడ్ ఆర్మీ వారి సహకారంతో 69 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని గుర్తు చేశారు. అనంతరం ఆదివాసి గిరిజనులతో కలిసి సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో తాండూర్ సీఐ కుమార స్వామి, మాదారం ఎస్ఐ సౌజన్య, తాండూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ఐ గంగారం, భీమిలి ఎస్ఐ విజయ్ కుమార్, రాబిన్ వుడ్ ఆర్మీ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News