- జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చిత్తూరు పట్టణములో జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ల్యాబ్ మరియు జిల్లా డీ-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో ఎక్సైజ్ శాఖ వారితో మద్యం మరియు మత్తు పదార్థాల నియంత్రణ విధానాలపై చర్చించారు.
ఎక్సైజ్ ల్యాబ్ పరిశీలన
జిల్లాలో అక్రమ మద్యం తయారీ, దందాలపై చర్యలు తీసుకోవడంలో ఎక్సైజ్ ల్యాబ్ కీలక పాత్ర పోషిస్తోంది. ల్యాబ్‌ను సందర్శించిన ఎస్పీ గారు, అక్కడ నిర్వహిస్తున్న రసాయన పరీక్షలు, మాదకద్రవ్యాల విశ్లేషణ విధానాలను పరిశీలించారు. మత్తు పదార్థాల నమూనాలను ఎలా పరీక్షిస్తున్నారో, వాటి ఖచ్చితమైన నివేదికలు ఎలా రూపొందిస్తున్నారో ఆయన సమగ్రంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, “అక్రమ మద్యం దందా నిర్మూలన కోసం పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ కలిసి పని చేయాలి. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి, నిఘా పెంచాలి. యువతను మత్తు పదార్థాల వైపు వెళ్లకుండా కఠినంగా చర్యలు చేపట్టాలి” అని అన్నారు.
డీ-అడిక్షన్ సెంటర్ సందర్శన
తర్వాత, జిల్లా డీ-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ మాట్లాడుతూ, “మత్తు పదార్థాల బారిన పడిన వారు స్వచ్ఛమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తే, సమాజం వారిని ఆదరించాలి. వీరి పునరావాసం కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, పోలీస్ మరియు ఎక్సైజ్ శాఖ కలిసి సహకరించాలి” అని సూచించారు. అలాగే, యువతను మత్తుపానీయాలు, డ్రగ్స్ నుంచి దూరంగా ఉంచేలా అవగాహన కల్పిస్తామని తెలిపారు. చిత్తూరు జిల్లాలో మత్తుపదార్థాల అక్రమ రవాణా, విక్రయం నిరోధించేందుకు పోలీసులు పలు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఎక్సైజ్ అధికారులతో కలిసి స్కూళ్లు, కాలేజీల దగ్గర మత్తుపదార్థాల విక్రయాలను నియంత్రించేందుకు నిఘా పెంచుతామని తెలిపారు. అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా యువత, మత్తు పదార్థాల బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసులకు సహకరించి, అక్రమ మత్తుపదార్థాల సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. సమాచారం అందించడానికి 1972 కు గాని లేదా చిత్తూరు పోలీస్ whatsapp నెంబర్ 9440900005 కు సమాచారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ ఇన్స్పెక్టర్ జయారయ్య, రెండవ పట్టణ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నిత్యబాబు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మరియు వైద్య నిపుణులు పాల్గొన్నారు.





