Thursday, April 2, 2026

దేశం గర్వపడేలా క్రీడల్లో రాణించాలి…

క్రీడాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్ సి (రాఘవుల శ్రీనివాసు):
దేశం మొత్తం గర్వించేలా క్రీడల్లో రాణించాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం హుజురాబాద్ లోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో ప్రారంభమైన జిల్లా స్థాయి హాకీ పోటీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. క్రీడాకారులు క్రీడలను ఆడడం వల్ల పోటీతత్వం పెరుగుతుందని అన్నారు. శారీరక ఉల్లాసం తో పాటు మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవుతారని అన్నారు. క్రీడలు, క్రీడాకారులు అంటే తనకెంతో ఇష్టమని, గతంలో తాను కూడా ఇండియా టీంలో క్రికెట్ ఆడానని గుర్తు చేశారు.
హుజురాబాద్ లో హాకీ ఆడి చాలామంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయితో పాటు జాతీయ స్థాయిలో కూడా రాణించారని గుర్తు చేశారు. అలాగే హాకీలో దేశం తరఫున ఆడి హుజురాబాద్ కు ఖ్యాతి తీసుకురావాలని ఆకాంక్షించారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని, అందులో భాగంగా హుజురాబాద్లో కూడా మంచి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినప్పుడు 10 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేశారని అన్నారు. హుజురాబాద్ లో ఒక అద్భుతమైన స్టేడియం నిర్మించాలనుకుని మొదలయ్యే సమయానికి ఎన్నికలు వచ్చాయని అన్నారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారగానే కాంగ్రెస్ ప్రభుత్వం హుజురాబాద్ స్టేడియాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాల్సింది ఉండగా స్టేడియం కోసం వచ్చిన నిధులను ఆపి ఇక్కడి క్రీడాకారులను అవమానపరిచిందన్నారు. వెంటనే హుజురాబాద్ స్టేడియం కోసం గతంలో కేటాయించిన 10 కోట్ల నిధులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి క్రీడాకారులపై ప్రేమ ఉంటే వెంటనే 10 కోట్ల నిధులతో స్టేడియాన్ని నిర్మించి క్రీడలను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ సింగ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, ప్రణవ్, మున్సిపల్ కౌన్సిలర్ల , మరియు, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News