- నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై వేటు హేయమైన చర్య
- ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : రైతులకు సరైన సమయానికి సాగునీరు అందక వరి పంటలు ఎండిపోతున్నాయి అని కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కోదాడ నియోజకవర్గం పరిధిలో గల మండలాలలో ఎండిపోయిన పంట పొలాలను 15 రోజుల నుండి పర్యటన చేసి పరిశీలించారు. రైతులతో మాట్లాడి సాగునీటి ఇబ్బందులు, పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బొల్లం మాట్లాడుతూ. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి బాధ్యత లేదు. సాగునీరు అందక పచ్చని పంట పొలాలు కండ్ల ముందే ఎండిపోయి రైతన్న తల్లడిల్లుతుంటే కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర పోతుందని ధ్వజమెత్తారు. రైతులు కష్టపడి పంటలు పండిస్తుంటే సాగునీరు లేక పొలాలు ఎండిపోయి పశువులకు మేతగా ఏర్పడుతున్నాయని అన్నారు. కండ్ల ముందే ఎండిపోతున్న పంట పొలాలను రైతులు కాపాడుకోలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ పదేండ్ల పాలనలో పాడి పంటలతో సంతోషంగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బీడు భూములుగా మార్చిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు తమ పంటలను తామే కాల్చుకునే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంట పొలాలకు ఎకరానికి రూ. 50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి రైతంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో స్పష్టమైన కారణం లేకుండా జగదీష్ రెడ్డి పై వేటు హేయమైన చర్య అని బొల్లం మల్లయ్య యాదవ్ పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి గొంతు నొక్కి ఏదో సాధిస్తామంటే అది సర్కార్ పిచ్చి ఆలోచన మాత్రమే తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. ప్రజా క్షేత్రంలో ప్రతిదానికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే రేవంత్ రెడ్డి మాటలు దురస్కారంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి హోదాను దిగజార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని అన్నారు. కెసిఆర్ పై మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మైకుల ముందు మాటలు మాట్లాడినంత ఈజీ కాదు పరిపాలన చేయడం .తెలంగాణ కోసం మరణానికి సిద్ధపడిన కేసీఆర్ చావు కోరుకునే నీచ బుద్ధి కలిగిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని త్వరలోనే ప్రజలు తరిమి కొట్టడం ఖాయం అని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరించారు.





