నేటి సాక్షి, బెజ్జంకి: మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి వెళ్లే ప్రధాన రహదారి అయిన పోతారం రోడ్డు పూర్తిగా గుంతలు పడిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ మాట్లాడుతూ పోతారం రహదారి పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్న అయినప్పటికీ ప్రభుత్వం కొత్త రోడ్డు వేయడానికి ఆసక్తి చూపడం లేదని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్లుగానే ప్రస్తుత ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని,వెంటనే నూతన రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా కల్లేపల్లి రహదారి కూడా గుంతలు పడిపోవడంతో ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని,బేగంపేట రహదారి పనులు మధ్యలోనే ఆగిపోవడంతో స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని స్థానిక శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చొరవ చూపించి, సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రహదారుల పునర్నిర్మాణం చేపట్టాలి. లేనిపక్షంలో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలు చేపడుతుందని సిపిఎం నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సంఘ ఎల్లయ్య, బొమ్మిడి సాయికృష్ణ, బోనగిరి లింగం, రఫీ తదితరులు పాల్గొన్నారు.





