- పార్లమెంటులో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ప్రశ్న
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల): ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతుల పంట భద్రతపై ముందుచూపుతో మైక్రో ఇరిగేషన్ అమలు, తిరుపతి జిల్లాలో సాదించిన పురోగతి, లబ్ధిదారులు వివరాలు, సూక్ష్మ నీటిపారుదల సాంకేతికత ప్రోత్సాహం గూర్చి తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామనాథ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం 2015-16 నుంచి దేశవ్యాప్తంగా అమలులో ఉందని తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 96.97 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మైక్రో-ఇరిగేషన్ చేపట్టారని తెలిపారు. తిరుపతి జిల్లాలో 20,819 హెక్టార్లు మైక్రో-ఇరిగేషన్ కింద కవర్ చేయబడిందని తెలియజేశారు. లబ్ధిదారులు, వారికి అందిస్తున్న ఆర్థిక సహాయం వివరాల గూర్చి వెల్లడిస్తూ సన్న, చిన్నకారు రైతులకు 55% సబ్సిడీ, ఇతర రైతులకు 45% సబ్సిడీ అందిస్తున్నామని పేర్కొన్నారు. 2015-16 నుండి ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 19,272 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధిపొందారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదికారిక లెక్కల ప్రకారం తక్కువ నీటి వినియోగంతో పండే పంటల ప్రోత్సాహంలో బాగంగా 2022-23 నుండి 2024-25 వరకు 14,332 హెక్టార్ల విస్తీర్ణంలో బోర్వెల్ ఆధారిత వరి, పొగాకు పొలాలను పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటలు పండించేలా పంట మార్పు చేశారని తెలిపారు. ఇందులో బాగంగా రూ.1.38 కోట్ల ఆర్థిక సహాయం అందించారని అన్నారు.
చిరు ధాన్యాలు, పప్పుధాన్యాల పంటలను ప్రోత్సహించడం, ఉత్తమ వ్యవసాయ పద్ధతులపై అవగాహనా కార్యక్రమాలు, నాణ్యమైన విత్తనాల పంపిణీ చేయడం, చిరు ధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, పంట కోత తర్వాత నిర్వహించాల్సిన కార్యక్రమాలపై శిక్షణ, వర్క్‌షాపులు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఖర్చు తక్కువ, అధునాతన నీటి నిర్వహణ పద్ధతులు, వర్షపు నీటి సంగ్రహణ, రీసైక్లింగ్, వర్షపు నీరు, ఉపరితల, భూగర్భ జలాలను సమన్వయంగా వినియోగించే విధానాల రూపకల్పన, స్మార్ట్, ప్రెసిషన్ టెక్నాలజీల ద్వారా సమర్థవంతమైన సాగు విధానాలు, సరైన నీటి పారుదల విధానాలు, భూసంరక్షణ పద్ధతులు అవలంబిస్తున్నామని తెలిపారు.





