- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల మంజూరులో గోల్మాల్ సహించం.
నేటి సాక్షి, గన్నేరువరం (బుర్ర అంజయ్య గౌడ్): గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి స్టేజి నుండి మండల కేంద్రం మీదుగా పోత్తూరు వరకు మంజూరైన డబుల్ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయని, రోడ్డు పనులు వేగంగా చేపట్టకపోతే బిఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో అంతా గోల్మాల్ జరుగుతుందని, ఒకరి చెక్కు మరొకరికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాని వాళ్ళ కోసం ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తామని, బాధితులు ఎవరైనా ఉంటే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంజూరు చేయించిన రోడ్డు ఇప్పటివరకు పూర్తి కాకపోవడం శోచనీయమని, కాంట్రాక్టర్ కంకర పోసి వదిలి వేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు పనులు చేపట్టని పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామని ఈ ఉద్యమానికి అప్పటి రోడ్డు సాధన సమితి సభ్యులు కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్లెల లక్ష్మి లక్ష్మణ్, మాజీ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, బద్దం తిరుపతిరెడ్డి, గూడెల్లి ఆంజనేయులు, అటికం శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి రవి, శ్రీనివాస్, అటికం రవిగౌడ్ ,బోయిని అంజయ్య,బొడ్డు బాలయ్య అనుమండ్ల మల్లేశం అధిక సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.





