నేటి సాక్షి, మందమర్రి:- కారుణ్య నియామకాల ద్వారా సింగరేణిలో ఉద్యోగం పొందిన నూతన కార్మికులు క్రమశిక్షణతో తమ ఉద్యోగ ధర్మాన్ని పాటించాలని సింగరేణి ఏరియా జిఎం జి దేవేందర్ సూచించారు. మంగళవారం స్థానిక జిఎం కార్యాలయంలో 40 మంది మెడికల్ ఇన్ వాలిడేషన్ కార్మికుల వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరియాలో ఇప్పటివరకు 1972 మంది వారసులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఇతర పరిశ్రమలతో పోలిస్తే సింగరేణిలో పని ప్రదేశాలు, పని సమయాలు భిన్నంగా ఉంటాయన్నారు. విధులకు గైర్హాజరైతే ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని సూచించారు. కష్టపడి పని చేసి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్, సిఎంఓఏఐ ఏరియా అధ్యక్షుడు రమేష్, ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, ఏరియా డివైపిఎం సత్య బోస్, పర్సనల్ విభాగ కార్యాలయ సూపరింటెండెంట్ రాజలింగు, ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.





