- నరకయాతన అనుభవిస్తున్న కాలనీవాసులు
- దళితవాడపై వివక్షేందుకు…
- స్థానిక సమస్యలపై సిపిఎం బస్తీ బాట

నేటి సాక్షి, మందమర్రి:- పట్టణంలోని ఒకటవ వార్డు ఎస్సీ కాలనీ పై అధికారుల, ప్రజాప్రతినిధుల వివక్షతో కాలనీవాసులు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, రోడ్డు, మురుగు కాలువ, దోమల సమస్యలతో కాలనీవాసులు నరకయాతన అనుభవిస్తున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, జిల్లా కమిటీ సభ్యుడు దూలం శ్రీనివాస్ లు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని ఒకటవ వార్డు, యాపల్, కేకే 2 ఎస్సీ కాలనీలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై బస్తీబాట కార్యక్రమంలో భాగంగా సిపిఎం కమిటీ సభ్యులు కాలనీలో పర్యటించారు. ఈ పర్యటనలో అక్కడ నివాసం ఉంటున్న నిరుపేదలను కలుసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, కాలనీలో మురుగునీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు నీరంతా ఎక్కడిక్కడ నిలువ ఉండడంతో విపరీతమైన దోమలు పెరిగి, ప్రజలు నరకాయాతన అనుభవిస్తున్నారన్నారు. అదే విధంగా కాలనీలో రోడ్డు సౌకర్యం సైతం లేదని తెలిపారు. ప్రజలు మురికి కూపంలో తీవ్ర ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజలు ఎన్ని దరఖాస్తుల పెట్టుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం లేదని తెలిపారు. కాలనీలో చెట్లు పెరిగి విద్యుత్ తీగలపై ఎప్పుడు విరిగిపడతాయో తెలియని పరిస్థితి నెలకొందని, దీనిపై విద్యుత్ శాఖ ఏఈ కి ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. 50 కుటుంబాలు నివాసం ఉంటున్న కాలనీలో చాలామంది అర్హులైన పేదలకు రేషన్ కార్డు లేదని, ఒంటరి మహిళలకు పెన్షన్ మంజూరు కావడం లేదన్నారు. అదేవిధంగా కేకే 2 ఓసి కార్యాలయం వద్ద రిక్వెస్ట్ బస్ స్టాప్ లేక సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, సంబంధిత అధికారులు దళిత వాడ అని వివక్ష చూపించకుండా, వీరికి కనీస సౌకర్యాలను కల్పించి, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమస్యలు పరిష్కారానికి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.






