- ఏళ్ల తరబడి టెంట్లు, మెడికల్ కిట్లు రాని వైనం
- పట్టించుకోని అధికారులు
నేటి సాక్షి, మునగాల (పాముల రాఘవేందర్) : పల్లెల్లో కూలీల వలసల ను నివారించడంతో పాటు వారికి పని కల్పించి చేసిన పనికి తగినట్లుగా వేతనాలు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రారంభంలో దశల వారీగా కూలీలకు గడ్డపారలు, మెడికల్ కిట్లు, టెంట్లు(గుడారాలు), తాగు నీరు లాంటి వసతులను కల్పించినప్పటికీ రాను రాను వారికి ఎలాంటి సదుపాయాలను కల్పించడం లేదు.ఇది వరకు కూలీలు సొంతంగా గడ్డపార సమకూర్చుకుంటే రోజుకు రూ. 10, తాగు నీటి కోసం రూ.5అందజేసే వారు. కనీసం ఇప్పుడు పని ప్రదేశం లో కనీస వసతులు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు అస్వస్థతకు గురవుతున్నారు. వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు కూలీలకు వడదెబ్బ తగలకుండా నీడ కోసం టెంట్లు వేసి రక్షణ కల్పించాల్సి ఉంటుంది. అలసటగా ఉంటే పొదలు, చెట్ల చాటున సేద తీర్చుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. కనీసం నీటిని సరఫరా చేయడానికి ఒక మేట్‌ను నియమిస్తే కూలీలకు సౌకర్యంగా ఉంటుంది. మునగాల మండల వ్యాప్తంగా ఉపాధి కూలీలకు వసతులు లేకపోవడంతో ఎండలోనే సేద తీరుతున్నారు. కూలీలకు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేద తీరడానికి ప్రభుత్వం గతంలో గుడారాలు, మెడికల్ కిట్లు పంపిణీ చేసేది. వాటిని క్షేత్ర సహాయకులు ప్రతీ రోజు పని ప్రదేశానికి తీసుకువెళ్లి వసతి కల్పించేవారు. ఆరు నుంచి ఏడు సంవత్సరాలుగా గుడారాలు, మెడికల్ కిట్లు ఇవ్వడం మరిచారు. కిట్టులో అయోడిన బాటిల్, బ్యాండేజి, దూది, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కొన్ని రకాల మాత్రలు ఉండేవి. కూలీలకు వీటిని కూడా ఏళ్ల తరబడి సమకూర్చడం లేదు. పనికి ఉపయోగించే పరికరాలు కూడా ఇవ్వడం లేదు. అధికారులు స్పందించి మెడికల్ కిట్లు, గుడారాలు ఏర్పాటు చేయాలని కూలీలు కోరుతున్నారు.
ఎలాంటి వసతులు కల్పించడం లేదు
పని ప్రదేశంలో కూలీలకు ఎలాంటి పరికరాలను ఇవ్వడంలేదు. గతంలో టెంట్లు,మెడికల్ కిట్లు ఇచ్చేవారు. ఇప్పుడు తాగడానికి నీరు కూడా మేమే తెచ్చుకుంటున్నాం. అలసట గా ఉంటే పొదలు, చెట్ల నీడన సేద తీరాల్సి వస్తోంది.
-గండు సత్యనారాయణ (రేపాల: గ్రామం)
తాగు నీరు సరఫరా చేయాలి
ఎండలు తీవ్రంగా కొడుతున్నాయి. పని ప్రదేశంలో ఎలాంటి వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నాం. కనీసం నీటిని సరఫరా చేయడానికి ఒక మేట్ ను నియమిస్తే సౌకర్యంగా ఉంటుంది. ప్రభుత్వం పని ప్రదేశంలో వసతులు కల్పించాలి.
తుమ్మ సత్తమ్మ (రేపాల : గ్రామం)
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తాను.
పని ప్రదేశంలో మెడికల్ కిట్ల కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరలో అందించే ప్రయత్నం చేస్తాను. మిగతా సమస్యలు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తాను.
ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్. వాసి మేకల సావిత్రి (రేపాల: గ్రామం)





