Thursday, April 2, 2026

మహిళా శక్తికి నిత్య స్ఫూర్తిగా నిలిచే గొప్ప నాయకురాలు మల్లు స్వరాజ్యం..

  • నైజాం సర్కార్ కు ముచ్చమటలు పట్టించిన మల్లు..
  • రజాకార్ల పాలిటి సింహ స్వప్నమైన ఎర్ర జెండా..
  • విప్లవ ధ్రువతార మల్లు స్వరాజ్యం..
  • ఘనంగా తృతీయ వర్ధంతి…
  • సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి..

నేటి సాక్షి , మునగాల (పాముల రాఘవేందర్) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కామ్రేడ్ మల్లు స్వరాజ్యం తృతీయ వర్ధంతి. మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో బుధవారం సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు జూలకంటి విజయలక్ష్మి ఆధ్వర్యంలో మల్లు స్వరాజ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931 లో జన్మించిన కామ్రేడ్ మల్లు స్వరాజ్యం నైజం సర్కార్ కు ముచ్చమటలు పట్టించి. రజాకార్ల పాలిటి సింహ స్వప్నమై నిలిచింది అన్నారు. కామ్రేడ్ మల్లు స్వరాజ్యం కష్ట జీవుల మట్టి మనుషుల ఉక్కు నేస్తం భూస్వామ్య రెడ్డి కుటుంబంలో జన్మించి బీద, అట్టడుగు వర్గాల ప్రజల తరఫున తన అన్న దళ కమాండర్ బిమిరెడ్డి నరసింహారెడ్డి తో పాటు రజాకారులను పులిమెరలకు తురిమిన వీర నారి మల్లు స్వరాజ్యం అన్నారు. ఈమె స్వయంగా ఉయ్యాల, బతుకమ్మ పాటలు రచించి పాడుతూ ప్రజలను చైతన్యం చేసి గేరిల్లా శిక్షణ పొంది తన మాటే ఒక తూటాగా దొరల గడిలను కూల్చిన పోరాట దీప్తి స్వరాజ్యం అన్నారు. ఈమె 1945-48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది. ఈమె పోరాటాల దాటికి తట్టుకోలేక 1947-48 లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు. మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాల్లో గిరిజనులను మేల్కొల్పింది. ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది. ఈమె ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నల్లగొండ జిల్లా తుంగతుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి 1978-1983, 1983-84 సంవత్సరాల లో రెండు పర్యాయాలు సిపిఐ ఎం పార్టీ తరఫున ఎన్నిక అయ్యిందని తెలిపారు. నమ్మిన ఆశయం కోసం తుపాకీ పట్టి విరోచితంగా పోరాడిన వీర వనిత మల్లు స్వరాజ్యం మహిళా శక్తిని చాటి చెప్పారని కొనియాడారు. ఈమె జీవితం నేటి యువతకు స్ఫూర్తి దాయకమన్నారు. జీవితాంతం ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేసిన మహా నాయకురాలు మల్లు స్వరాజ్యం అని పేర్కొన్నారు. అనంతరం కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాయమ్మ, రేణుక, నాగమ్మ, మణెమ్మ, సునీత పలువురు మహిళలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News